పోలీసుల అండతో పేదలపై దౌర్జన్యాలు
-
లారీ ఓనర్‌పై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి ఆగ్రహం
-
బాధితులతో కలిసి పీసీ సవాంగ్‌కు ఫిర్యాదు
విజయవాడ : అధికార పార్టీకి చెందిన ఓ లారీ ఓనర్ పెనమలూరు నియోజకవర్గంలో పోలీసు అధికారుల అండతో పేదలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి విమర్శించారు. లారీ ఓనర్ కారణంగా ఇబ్బదులు ఎదుర్కొంటున్న బాధితులతో కలిసి ఆయన ఆదివారం విజయవాడ పోలీస్ కమిషనరేట్‌లో సీపీ గౌతం సవాంగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. పెనమలూరు నియోజకవర్గంలో లారీ ఓనర్ మైనేని దుర్గాప్రసాద్ అలియాస్ నాని డ్రై వర్లు, క్లీనర్లపై దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని వివరించారు. ఈ నెల 4వ తేదీన పోరంకి వద్ద లారీ కార్మికుడు వీరంకి సుబ్బారావుపై దౌర్జన్యానికి పాల్పడినా ఇంతవరకు పోలీసులు చర్యలు తీసుకోలేదని ఫిర్యాదుచేశారు. గతంలో అసోం నుంచి విస్కీబాటిళ్లు తీసుకురాలేదని లారీ డ్రై వర్ షేక్ ఇస్మాయిల్‌పై నాని దౌర్జన్యం చేశారని తెలిపారు. ఆకునూరు గ్రామంలో లారీ డ్రైవర్ శంకర్‌ను బెదిరించగా అతను ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. అధికార పార్టీ వత్తాసుతో పోలీసు అధికారులు, సిబ్బంది ఆ లారీ ఓనర్‌పై చర్యలు తీసుకోవడం లేదని పార్థసారథి వివరించారు. ఆ లారీ యజమాని తీరుతో స్థానికుల్లోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయని వివరించారు. అతను పెనమలూరు పోలీసు స్టేషన్ తన సొంత జాగీరుగా భావిస్తున్నారని అన్నారు. ఆ పోలీసుస్టేషన్లో అధికారులు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారని ఆరోపించారు. లారీ ఓనర్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు బాధితులు ప్రాణ రక్షణ కల్పించాలని తనను కలవగా, వారిని సీపీ కార్యాలయానికి తీసుకువచ్చానని పార్థసారథి చెప్పారు. బెజవాడ వస్తే తమ అంతు చూస్తామని లారీ ఓనర్ నాని తరచూ బెదిరిస్తున్నారని పలువురు బాధితులు కూడా సీపీకి ఫిర్యాదు చేశారు. లారీ ఓనర్ నానిపై పెనమలూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బాధితులు షేక్ ఇస్మాయిల్, హుస్సేన్, రత్నం, వీరంకి సుబ్బారావు సీపీని కలిసి ఫిర్యాదు చేశారు.
సీపీ సానుకూలంగా స్పందించారు
తమ ఫిర్యాదులపై సీపీ గౌతమ్ సవాంగ్ సానుకూలంగా స్పందించారని పార్థసారథి మీడియాకు చెప్పారు. వీరంకి సుబ్బారావు కేసు విషయమై వెంటనే చర్యలు తీసుకుంటామని సీపీ చెప్పారని పేర్కొన్నారు. అసోం నుంచి విస్కీబాటిళ్లు తీసుకురావాలంటూ నాని బెదిరించిన కేసును కూడా విచారణ చేస్తామని సీపీ చెప్పారని తెలిపారు.