
'నా 24 ఎకరాల భూమిని పేదలకు ఇచ్చేయండి'
సుండుపల్లి: ఆయన పేరు మల్లు శివారెడ్డి. గతంలో వైఎస్సార్ జిల్లా రాయచోటి సమితి ప్రెసిడెంట్‌గా పనిచేశారు. బిడ్డలు విదేశాల్లో స్థిరపడ్డారు. ముందునుంచి సేవాభావంగల ఆయన పేదలకు శాశ్వత సాయం చేయాలనుకున్నారు. తనకున్న 24 ఎకరాల వ్యవసాయభూమిని పేదలకు వితరణ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల వైఎస్సార్ జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
సంబేపల్లి మండలం శెట్టిపల్లి గ్రామ పంచాయతీ నరసారెడ్డిగారిపల్లెలో తనకు 24 ఎకరాల భూమి ఉందని, దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు ఇవ్వాలని ఆయన కోరారు. గతంలో ఈయన సుండుపల్లి మండలంలో కస్తూర్బా ఉన్నత పాఠశాలకు 5 ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చారు. వైఎస్సార్‌సీపీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్న శివారెడ్డికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో సత్సంబంధాలు ఉండేవి.