బేతంపూడిలో సర్వేశ్ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
టేకులపల్లి: బేతంపూడి గ్రామానికి చెందిన బైకాని సర్వేశ్(42) ఇంటికి సర్వీస్ వైర్ తగిలి విద్యుత్ ప్రసారం కావడంతో..మృతి చెందాడు. ఇతను వ్యవసాయ పనులతో పాటు ఎలక్ట్రీషియన్‌గానూ పనిచేస్తుండేవాడు. సోమవారం ఇంటి వెనుక పని చేస్తుండగా..కరెంట్‌స్తంభం నుంచి తీసిన సర్వీసు వైరు కొంచెం తెగి..ఇంటి గోడలకు విద్యుత్ సరఫరా అయింది. ఇది గమనించని సర్వేశ్..పనిచేస్తూ అనుకోకుండా విద్యుత్ తీగను పట్టుకున్నాడు. షాక్‌కు గురై తీవ్ర అస్వస్థత పాలయ్యాడు. కుటుంబ సభ్యులు కొత్తగూడెం ఆస్పత్రికి తరలిస్తుండగా..మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య మాధవి, పిల్లలు ఉన్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య సర్వేశ్ మృతదేహాన్ని సందర్శించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా సాయం అందేలా చూస్తానన్నారు.
కామేపల్లి: జాస్తిపల్లి గ్రామంలో పాటి వెంకటయ్య (70) అనే వృద్ధుడు తన ఇంటిలో ఇనుప దండెంపై కండువా తీస్తుండగా..ఇంల్లోని విద్యుత్ తీగ ద్వారా దీనికి విద్యుత్ సరఫరా జరిగి..కరెంట్ షాక్‌తో చనిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..బైండింగ్ వైర్లతో ఏర్పాటు చేసుకున్న దండెంపై ఎప్పటి మాదిరే బట్టలు ఆరేశారు. ఈయన కండువా తీస్తుండగా..అప్పటికే గృహ విద్యుత్ వైరు నుంచి దీనికి విద్యుత్ సరఫరా అయిన విషయం గుర్తించక..విద్యుదాఘాతానికి గురై..కిందపడినప్పుడు తలకు బలమైన దెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు.