కర్నూలు : సమయానికి వైద్యం అందక.. ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కర్నూలు జిల్లా ఆదోనిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన మృతుని బంధువులు ఆస్పత్రిపై దాడి చేసి... ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి... స్థానికంగా నివాసముంటున్న బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి శివన్న(45) గురువారం ఉదయం వాకింగ్ చేస్తున్నారు.
ఆ సమయంలో అదుపు తప్పి ఆటో ఆయనను ఢీ కొట్టింది. దీంతో శివన్న తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్య సిబ్బంది లేకపోవడంతో.. సరైన సమయంలో వైద్యం అందక పోవడంతో శివన్న మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలైందని బంధువులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ఆసుపత్రిపై వారు దాడి చేసి ఫర్నీచర్ ధ్వంసం చేశారు.