
బావమరిదిని చంపిన బావ
♦ మద్యం మత్తులో డబ్బుల కోసం ఘర్షణ
♦ ధారూరు మండలం తరిగోపుల గ్రామంలో ఘటన
♦ డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంతో పరిశీలన
♦ వివరాలు సేకరించిన డీఎస్పీ స్వామి
ధారూరు: తాగిన మైకంలో డబ్బుల విషయంలో ఘర్షణ జరగడంతో బావమరిదిపై బావ కర్రతో దాడి చేసి హత్య చేశాడు. ఈ సంఘటన ధారూరు మండలంలోని తరిగోపుల గ్రామ శివారులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వికారాబాద్ డీఎస్పీ స్వామి, మోమిన్‌పేట్ సీఐ రంగా కథనం ప్రకారం.. ధారూరు మండలం నాగ్‌సాన్‌పల్లికి చెందిన బాలయ్య, పార్వతమ్మ దంపతులు తరిగోపుల సమీపంలోని ఓ ఫాంహౌస్‌లో పనిచేస్తున్నారు. ఇదే మండలం గురుదోట్ల గ్రామానికి చెందిన బోయ శ్రీనివాస్(30) మూడు రోజుల క్రితం తన అక్కాబావ వద్దకు వచ్చాడు.
వారివద్దే ఉన్న అతడు బావ బాలయ్యకు తెలియకుండా ఆయన జేబులోంచి రూ. 700 తీసుకున్నాడు. ఇదిలా ఉండగా, సోమవారం సాయంత్రం బావ, బావమరిది ఇద్దరు కలిసి మద్యం తాగారు. అనంతరం డబ్బుల విషయంలో వారిమధ్య ఘర్షణ జరిగింది. ‘నా డబ్బులే తీసుకుని.. నాపైనే దబాయిస్తావా..?’ అంటూ బాలయ్య కర్రతో బావమరిది శ్రీనివాస్‌పై దాడిచేశాడు. శ్రీనివాస్ ఫాంహౌస్‌లోంచి బయటకు పరుగులు తీసినా విడిచిపెట్టలేదు. బాలయ్య అతడిని వెంబడించి చంపేశాడు. మంగళవారం ఉదయం హత్య సమాచా రం తెలుసుకున్న వికారాబాద్ డీఎస్పీ స్వామి, మోమిన్‌పేట్ సీఐ రంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు.
డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. అయితే శ్రీనివాస్‌కు పదేళ్ల క్రితం ధారూరు మండలం కొండాపూర్‌కలాన్‌కు చెందిన లక్ష్మితో వివాహమైంది. ఓ కొడుకు, కూతురు ఉన్నారు. భర్త వేధింపులు భరించలేక నెల రోజుల క్రితం లక్ష్మి పిల్లలను తీసుకుని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, హత్య కేసులో బాలయ్యతో పాటు ఆయన భార్య పార్వతమ్మ పాత్రపై విచారణ జరుపుతున్నామని, నిందితుడు పరారీలో ఉన్నాడని డీఎస్పీ తెలిపారు. హతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.