నగరంతో నాది సంగీత అనుబంధం
- మంగళంపల్లి బాలమురళీకృష్ణ
సాక్షి, సిటీబ్యూరో: అగ్రశేణి కర్ణాటక సంగీత విద్వాంసులు, పద్మవిభూషణ్ బిరుదాంకితులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణకు హైదరాబాద్‌తో గొప్ప సంగీత అనుబంధం ఉంది. నగరానికి చెందిన హైదరాబాద్ బ్రదర్స్‌గా పేరుగాంచిన రాఘవచారి, శేషాచారి, ఈలపాట శివప్రసాద్‌లు ఆయనకు ప్రియ శిషు్యలు. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మంగళంపల్లి మొదట వారిదగ్గరే ఆశ్రయం పొందేవారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా ఉన్న సమయంలో మూడో స్నాతకోత్సవానికి బాలమురళీకృష్ణను ముఖ్య అతిథిగా ఆహ్వానించి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.
రవీంద్రభారతి వేదికపై తన శిషు్యడు ఈలపాట శివప్రసాద్‌ను ఇక నుంచి నీవు ‘గళ మురళి’ గా పిలవబడతావని డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రకటించి, శిషు్యడిపై తనకున్న అభిమానాన్ని చాటుకొన్నారు. ఎన్నో వందలసార్లు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ హైదరాబాద్ నగరానికి వచ్చేసి కచేరీలు నిర్వహించి, ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు.
వంశీతో 45 ఏళ్ల అనుబంధం...
ప్రముఖ కల్చరల్ సంస్థ వంశీతో ఆయనకు 45 ఏళ్ల అనుబంధం ఉంది. 2015 సెప్టెంబర్ 14న రవీంద్రభారతిలో జరిగిన వంశీ సంస్థ 45వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు.
జీర్ణించుకోలేకపోతున్నాం...
డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతిని తాము జీర్ణించుకోలే పోతున్నామని వంశీ సంస్థ నిర్వాహకులు వంశీ రామరాజు, డాక్టర్ తెన్నేటి సుధాదేవి గద్గద స్వరంతో తెలిపారు. మళ్లీ అటువంటి సంగీత విద్వాంసుడ్ని ఈ జన్మలో చూడలేమన్నారు.ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
రసమయి సంస్థతో విడదీయలేని
అనుబంధం..
ప్రముఖ కల్చరల్ సంస్థ రసమయి సంస్థతో డాక్టర్ మంగళంపల్లిది విడదీయలేని అనుబంధం అని రసమయి సంస్థ నిర్వాహకులు డాక్టర్ ఎంకే రాము తెలిపారు. ప్రతి ఏడాది ప్రదానం చేసే పైడి లక్ష్మయ్య ప్రతిభా పురస్కారాన్ని డాక్టర్ బాలమురళీకృష్ణకు ప్రదానం చేసినట్లు చెప్పారు. ఎస్.రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో రసమయి నిర్వహించిన ఆడియో క్యాసెట్‌లో ఒకపాట బాలమురళీకృష్ణ కృతితో పాడించారన్నారు. ఆ సంగీత విద్వాంసుడు తమను వీడి వెళ్లటాన్ని ఊహించలేకపోతున్నామని చెప్పారు.
ఈ రోజు నాకు దుర్దినం..
గురువు, తండ్రి..అన్నీ నాకు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణనే అని ఈలపాట శివప్రసాద్ శోకతప్త హృదయంతో వెల్లడించారు. ఈరోజు నా జీవితానికి ఒక దుర్దినమన్నారు. ‘ఈలపాటను చేరదీసిన మహానుభావుడు ఆయన. రవీంద్రభారతిలో ఆయన ఎప్పుడు కచేరీలు చేసినా ఈలపాటకు ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఆ పరంపరలోనే రవీంద్రభారతి వేదికపై నాకు ఆయన ‘ గళ మురళి’ అని పేరు పెట్టాడు. గురువు సంకల్పంతోనే నేను ఇంతకాలం రాణిస్తూ వచ్చాను. నా తొలి క్యాసెట్‌లో బాలమురళీకృష్ణ పాడారు. నాకు ఇంతకాలం దైవంతో సమానంగా ఉన్నారు. నాకు భగవంతుడు బాలమురళీకృష్ణనే. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను..’ అని శివప్రసాద్ గద్గధ స్వరంతో చెప్పారు.
పలువురి సంతాపం...
డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతి తెలుగు వారికి తీరనిలోటని యువకళావాహిని కల్చరల్ సంస్థ నిర్వాహకులు వైకే నాగేశ్వరరావు తెలిపారు. ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. పద్మవిభూషణ్, కర్ణాటక సంగీత విద్వాంసుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతి సంగీత సామ్రాజ్యానికి తీరనిలోటని, భాషా సాంస్కృతిక శాఖ పక్షాన ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నట్లు డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు.
మరికొందరు...
గాన గంధర్వుడు ప్రముఖ శాస్త్రీయ సంగీత వాగ్గేయ కారుడు డాక్టర్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ మృతికి గానసభలో పలు సాంస్కృతిక సంస్థలు సంతాపం ప్రకటించాయి. గాన సభ అధ్యక్షులు కళాదీక్షితులు, వంశీరామారాజు, నటులు గుండు హనుమంతరావు, రచయిత ముదిగొండ శివప్రసాద్, దైవిజ్ఞశర్మ, గాన సభ పాత్రికేయులు ప్రగాఢ సంతాపం తెలిపారు.
గతేడాది సెప్టెంబర్‌లో రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ పాల్గొన్నారు. ఆ సందర్భంలో హైదరాబాద్ నగరంతో తనకున్న అనుబంధాన్ని ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు.. ఆ జ్ఞాపకాలు మరోసారి...
మిగతా విషయాలతో కన్నా హైదరాబాద్‌తో నాకు సంగీత అనుబంధమే ఎక్కువగా ఉంది. ఎప్పటినుంచో ఇక్కడికి వస్తున్నా.. ప్రజలు నా సంగీతాన్ని విని ఆనందిస్తున్నారు. నన్ను అభిమానిస్తున్నారు. యువత వెస్ట్రన్ సంగీతం విన్నా, ఆకర్షితులైనా, మరే సంగీతం వంటపట్టించుకున్నా అన్ని సంగీతాలు మనవే. మన సంగీతం నుంచి పుట్టినవే అన్నీ. అన్ని రాగాలు మనవే. వెస్ట్రన్ సంగీతం అలవాటు పడ్డ వారు కూడా మన పిల్లలే కదా. ఎటు తిరిగి ఎటుపోయినా మళ్లీ శాస్రీ్తయ సంగీతం దగ్గర వారంతా ఆగాల్సిందే. రోగాలు నయం చేసేందుకంటూ ప్రత్యేక పాటలు, సంగీతం అంటూ ఏమీలేవు.. సంగీతంతో కూడిన రాగాలు వింటూ ఉంటే రోగాలు వాటంతట అవే తగ్గిపోతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో శాస్రీ్తయ సంగీతం విన్నా, నేర్చుకున్నా మంచే జరుగుతుంది. సంగీతప్రియులు ఇన్ని సంవత్సరాలు నన్ను ఆదరించి ప్రేమించారు. బాగా చూసుకున్నారు.. ఈ ఆదరాభిమా నాలు నేను ఉన్నన్నాళ్లు లభించాలని కోరుకుంటున్నాను.
– సాక్షి, సిటీబ్యూరో