
పాన్ తో పనులెన్నో..
► నోట్లరద్దుతో నగరంలో పెరిగిన పాన్ కార్డుల సంస్కృతి
► బ్యాంకు ఖాతాలకూ తప్పనిసరి
చిత్తూరు ఎడ్యుకేషన్: నేడు ప్రతి ఒక్కరికీ పాన్ కార్డు అవసరం పెరిగింది. ఆదాయపన్ను శాఖ ప్రతి ఒక్కరికీ కేటాయించే శాశ్వత ఖాతా సంఖ్యను పర్మినెంట్ అకౌంట్ నంబర్ అంటారు. అంకెలు, అక్షరాలు కలిపి ఆ పాన్ కార్డులో పది ఉంటాయి. చాలా మందికి పాన్ కార్డు ఎక్కడ ఇవ్వాలి...? ఎక్కడ వద్దు..? అనే విషయంలో తికమకపడుతుంటారు.
టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటికీ చాలా మందికి పాన్ కార్డు గురించి తెలియకపోవడం, ఎలా తీసుకోవాలో, దాని ఉపయోగాలేమిటీ...? అన్న అంశాలపై అవగాహన లేదు. ప్రస్తుతం చిత్తూరు నియోజకవర్గంలోని ప్రజలు పాన్ కార్డు పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. వాహనం కొనాలన్నా, బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయాలన్నా, అమ్మకాలు జరిపే సమయాల్లో తదితర వాటికి పా¯ŒSకార్డు తప్పనిసరి కావడంతో నగర వాసులు వీటిపై మక్కువ చూపుతున్నారు.
దరఖాస్తు ఇలా..
పాన్ కార్డుకు సంబంధించిన సేవలను మెరుగుపరచడం కోసం ప్రతి నగరంలోని పాన్ సేవా కేంద్రాలుంటాయి. వీటితోపాటు స్పెషలిటేషన్ కేంద్రాల్లోనూ పాన్ కార్డుల కోసం సంప్రదించవచ్చు. ఆకార్డు కోసం సంబంధిత వ్యక్తి పాస్‌పోర్టు సైజు కలర్ ఫొటో, వ్యక్తిగత గుర్తింపు పత్రం, చిరునామా పత్రాలను ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆధార్, పాస్‌పోర్టు, పదోతరగతి మార్కుల జాబితా, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు వాటిలో ఏదో ఒకటి తీసుకెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసిన 15 రోజుల తరువాత సంబంధిత వ్యక్తి చిరునామాకు పోస్టు ద్వారా పాన్ కార్డు అందుతుంది.
ఎప్పుడు అవసరమంటే.
► రూ.50 వేలు పైబడి బ్యాంకులో నగదు డిపాజిట్ చేసే సమయంలో.
► బ్యాంకులో ఖాతా తెరిచేటప్పుడు
► డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు తెరవడానికి
► చెక్కులు, డీడీల లావాదేవీలు రూ.50 వేలను మించితే
► స్థిరాస్తి, వాహనాల కొనుగోలు, అమ్మకాలు జరిపేటప్పుడు
► హోటళ్లు, విలాసాలు ఖర్చుల వంటి వాటి కోసం రూ.20 వేల కంటే ఎక్కువ నగదు చెల్లించాల్సి వచ్చినప్పుడు