లక్డీకాపూల్‌లోని వెంకటేశ్వర హోటల్ ముందు భారీగా నిలిచిపోయిన వాహనాలు..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కురుస్తున్న వర్షం వాహనదారులకు కష్టాలు చూపిస్తున్నాయి. రోడ్లపైకెక్కిన వాహనాలన్నీ ట్రాఫిక్ దిగ్భందంలో చిక్కుకున్నాయి. రహదారులన్నీ జలమయం కావడంతో పాటు భారీగా పడ్డ గుంతలతో వాహనాలు ముందుకు కదిలేందుకు గంటల కొద్దీ సమయం పట్టింది. సిటీలోని అన్ని ప్రధాన జంక్షన్లతో పాటు మెట్రో రైలు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో విపరీతమైన ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తింది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు.
► మాదాపూర్ పోలీస్‌స్టేషన్ నుంచి సైబర్ టవర్స్ వెళ్లే రోడ్డు దెబ్బతినడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.
► లింగంపల్లి, తారానగర్, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, గౌలిదొడ్డి, మాదాపూర్ ప్రాంతాల్లో రహదారుల పైకి వరదనీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
► జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతంలో జోరుగా వర్షం కురవడంతో ఉదయం నుంచి ఆయా మార్గాల్లో ట్రాఫిక్ నత్తనడకన సాగింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36, 1, 2, 3, 10, 12లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. కొన్నిచోట్ల ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. మాదాపూర్ నుంచి వచ్చే వాహనాలను జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 మీదుగా డైవర్ట్ చేశారు. లా అండ్ అర్డర్ పోలీసులు కూడా ట్రాఫిక్ సేవలు అందించారు.
► మలక్‌పేట నియోజకవర్గంలో గురువారం మధ్యాహ్నం కురిసిన వర్షంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. చాదర్‌ఘాట్–దిల్‌సుఖ్‌నగర్, నల్గొండ చౌరస్తా–సైదాబాద్, దోబీఘాట్ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
► సికింద్రాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, కవాడిగూడ ప్రాంతాల్లో దట్టమైన మేఘాల కారణంగా మధ్యాహ్నం చీకట్లు అలుముకోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణించారు.
► భారీ వర్షానికి తార్నాక నుంచి లాలాపేట వెళ్లే దారిలో ఉన్న బ్రిడ్జి ప్రమాదకర స్థితికి చేరడంతో ఇటీవలే అధికారులు కూల్చివేశారు. దీంతో మౌలాలి, ఈసీఐఎల్ వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
► వర్షాల వల్ల రోడ్లపై ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌ను పరిష్కరించడంలో కృషి చేసిన ట్రాఫిక్ పోలీసులను సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ అభినందించారు.
1.5 కి.మీ. దూరం.. 2 గంటల ప్రయాణం
అరగంట వర్షం.. మూడు చోట్ల భారీగా వరద నీరు..
కిలోమీటరున్నర దూరం.. రెండు గంటల ప్రయాణం..
గురువారం లక్డీకాపూల్ నుంచి ఖైరతాబాద్ మీదుగా పంజగుట్టకు వెళ్లిన వాహనదారుల పరిస్థితి ఇదీ. మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి అడుగడుగునా వరద నీరు నిలిచిపోవడంతో వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి తలెత్తింది. లక్డీకాపూల్ నుంచి పంజగుట్ట చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టింది. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి లక్డీకాపూల్ వెళ్లే వాహనదారులు గంటపాటు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. దీన్ని నివారించేందుకు వాహనాలను ఖైరతాబాద్ జంక్షన్ నుంచి రాజ్‌భవన్ వైపు మళ్లించాల్సి వచ్చింది. అడుగడుగునా నీటి గండం వాహనదారులకు ప్రత్యక్ష నరకాన్ని చూపించింది. – బంజారాహిల్స్