నా రూటే సపరేటు!
నా రూటే సపరేటు!
Published Tue, Aug 15 2017 12:16 AM | Last Updated on Fri, Aug 30 2019 8:37 PM
కొవ్వూరులో మంత్రి పోటీ కార్యక్రమం
జెండా వందనానికి ఏర్పాట్లు
ఆర్‌డీఓ పేరుతో ఆహ్వాన పత్రిక
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
నా రూటే సపరేటు అంటున్నారు అబ్కారీ మంత్రిగారు... ఈసారి జిల్లా ఇంఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు జెండా వందనం చేసే అవకాశం ప్రభుత్వం కల్పించడంతో తన నియోజకవర్గంలో పోటీగా కార్యక్రమం నిర్వహించేందుకు మంత్రి కె ఎస్ జవహర్ చేస్తున్న ఏర్పాట్లు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆర్డీఓ పేరుతో దీని కోసం ఆహ్వాన పత్రిక కూడా వేయించారు.
జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేస్తుంది. అక్కడే జెండా వందనం చేసిన మంత్రి గారి సందేశం, పోలీసు వందనం, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రశంసా పత్రాల ప్రదానం, లబ్దిదారులకు వివిధ ప్రభుత్వ పథకాల రాయితీల పంపిణీ ఉంటుంది. ఈ ఏడాది కూడా ఏలూరులో పోలీసు పెరెడ్ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మిగిలిన చోట్ల మండల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనవాయితీ. అధికారికంగా మాత్రం జిల్లాను యూనిట్‌గా తీసుకుని జిల్లా కేంద్రంలో ఈ వేడుకలు నిర్వహిస్తుంటారు. దీనికి జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన మంత్రి జెండా ఎగువవేయడం రివాజుగా వస్తుంది. గత మూడేళ్లు దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జెండా అవిష్కరణ చేస్తూ వచ్చారు. ఈ ఏడాది జిల్లా ఇంఛార్జి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేరును ప్రభుత్వం ప్రకటించింది. అయితే రాష్ట్ర పొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్ మాత్రం కొత్త పం«థాకు తెరలేపారు. కొవ్వూరులో మాత్రం అన్ని శాఖల అ«ధికారుల భాగస్వామ్యంతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేశారు. దీనికి ఆర్డీఓ పేరుతో ఆహ్వాన పత్రం ముద్రించడం తోపాటు అన్ని శాఖల అధికారులతో ఆయన ఏర్పాట్లు సమీక్షించారు. గృహ నిర్మాణ శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలు శకటాలను సైతం ఏర్పాటు చేశాయి. ఇతర శాఖలను అడిగినా వారు సానుకూలంగా స్పందించలేదు. మరో ఆరుశాఖలు స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అధికారులంతా గత మూడు, నాలుగు రోజుల నుంచి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నాలుగు రోజుల పాటు వరుసగా సెలవులు వచ్చినప్పటికీ మంత్రి ఆగ్రహానికి లోనుకావాల్సి వస్తుందని అధికారులు ఏర్పాట్లులో తలమునకలయ్యారు. కొవ్వూరు మండలంతో పాటు పట్టణ వ్యాప్తంగా ఉన్న విద్యార్ధులను తరలించే బాధ్యతను ఎంఈఓకు అప్పగించారు. ఒక్కో శకటం తయారీకి రూ.50 వేలు ఖర్చువుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఖర్చులకు సంబంధించిన బిల్లులు అందజేస్తే సొమ్ములు చెల్లిస్తామని ఆర్డీఓ సమీక్షా సమావేశంలో వెల్లడించారు. తీరా ఖర్చు చేసిన తర్వాత సొమ్ములు వస్తాయో రావోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ శాఖ ద్వారా అందించే యంత్ర పరికరాలు, సబ్సిడీపై అందించే పరికరాలు, ఇతర శాఖలు ద్వారా అందించే సబ్సిడీ సామగ్రి అంతా ఈ వేడుకలకు తరలిస్తున్నారు. పట్టణంలో సంస్కృత పాఠశాలలో భారీ ఎత్తున నిర్వహించే ఈ వేడుకలకు సుమారు నాలుగు వేల మంది హాజరవుతారని ఆర్డీఓ బి.శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం సాయంత్రం ప్రాంగణంలో ఏర్పాట్లును ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. కుర్చీలు, టెంటులు, వేదికలు, తాగునీరు, డ్రింక్స్ వంటి ఏర్పాటు చేశారు. వీటికి సుమారు రూ.ఐదు లక్షలకు పైనే ఖర్చులు అవుతున్నట్టు అంచనా. ఈ భారమంతా అధికారులపైనే వేస్తున్నారన్న విమర్శలున్నాయి. మొత్తానికి పోటీగా జరుపుతున్న ఈ వేడుకలు జిల్లాలో చర్చకు దారితీసాయి.
Advertisement