
విరాళాల వివాదంపై విచారిస్తా
♦ అరసవల్లి ఈవో, ప్రధాన అర్చకుని వ్యవహారంపై మంత్రి మాణిక్యాలరావు స్పష్టీకరణ
♦ అర్చకులు పత్రికలకు ఎక్కడం ఏమిటని ప్రశ్న
♦ సిబ్బందికి, అర్చకులకు బయోమెట్రిక్ అమలు చేయాలని ఆదేశం
అరసవల్లి(శ్రీకాకుళం):
అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో దాతల విరాళాల సేకరణ విషయంలో ఈవో, ప్రధాన అర్చకుల మధ్య తలెత్తిన వ్యవహారం తన దృష్టికి వచ్చిందని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి తగు చర్యలు చేపడతానని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పి.మాణిక్యాలరావు వెల్లడించారు. అర్చకులు పత్రికలకు ఎక్కడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం అరసవల్లి సూర్యదేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్యామలాదేవి, అర్చకుడు ఇప్పిలి నగేష్ శర్మ తదితర బృందం ఆలయ సంప్రదాయం ప్రకారం పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడారు.
జిల్లాలోని ఆలయాల్లో భక్తుల తాకిడిని బట్టి అభివృద్ధికి ప్రణాళికలు వేస్తున్నామన్నారు. శ్రీకూర్మం, శ్రీముఖలింగం, గుళ్ల సీతారాంపురం దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. టీటీడీతో సంయుక్తంగా ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో పలు ఆలయాల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. అర్చకుల జీతాలను ఇటీవలే పెంచామని, ఆలయాల పవిత్రతను కాపాడేందుకు చర్యలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. దివ్యదర్శనం పేరిట జిల్లాలో ఇప్పటి వరకు సుమారు పది వేల మందికి పైగా భక్తులు ఉచితంగా యాత్రలు చేశారన్నారు. జిల్లాలో ప్రధాన దేవాలయమైన అరసవల్లిలో భక్తుల కోసం నిత్యం ప్యూరిఫైడ్ వాటర్‌ను ఉచితంగా అందజేయాలని ఆదేశించారు. నిత్యాన్నదానం పథకం ద్వారా భక్తులకు పెద్ద సంఖ్యలో అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు పెంచాలని సూచించారు. ఆలయంలో జరుగుతున్న పలు వ్యవహారాలపై ఇవోను అడిగి తెలుసుకున్నారు.
అర్చకులు పత్రికకు ఎక్కడం ఏమిటి?
స్వామి సేవలో ఉండాల్సిన అర్చకులు అనవసర వ్యవహారాల్లో తలదూర్చి పత్రికలకు ఎక్కడం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. ఆలయ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన అక్కడున్న అర్చకులు, ఈవో సమక్షంలోనే ఈవ్యవహారంపై విచారించి చర్యలు చేపడతానని స్పష్టం చేశారు. తర్వాత అధికార సిబ్బంది హాజరు, అన్నదానం, ఎఫ్‌డీఆర్, దాతల విరాళ నిధుల వివరాల రిజిస్టర్లను పరిశీలిస్తున్న సందర్భంలో మంత్రి తీవ్రంగా స్పందించారు. ఆలయ అభివృద్ధికి విరాళాలిస్తున్న దాతల వ్యవహారాల్లో అక్రమాలు జరుగుతున్నట్లు పత్రికల్లో కథనాలు రావడంపై ఈవో శ్యామలాదేవితో మాట్లాడారు.
ఇది ఎంతో ఆందోళనకరమైన అంశమని, అర్చకులు, అధికారులు సమన్వయంతో ఆలయ అభివృద్ధికి పని చేయాలని సూచించారు. దాతల వ్యవహారంలో ఎక్కడ పొరపాట్లు, అక్రమాలు జరిగినా ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఆలయాల్లో అధికారులదే కీలక పాత్ర అని, పూర్తి బాధ్యత ఆ అధికారిపైనే ఉంటుందని స్పష్టం చేశారు. కాగా మంత్రి కార్యక్రమానికి ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకశర్మ గైర్హాజరవ్వడంపై స్థానికంగా చర్చ జరిగింది.
త్వరలో ట్రస్ట్‌బోర్డు నియామకం
అరసవిల్లి ఆలయానికి త్వరలోనే ట్రస్ట్‌బోర్డును నియమిస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటికే 90 శాతం దేవాలయాల్లో ట్రస్ట్‌బోర్డుల నియామకాలు పూర్తయ్యాయని, అరసవిల్లితో పాటు మరికొన్ని దేవాలయాల్లో త్వరలోనే చేపడతామన్నారు. అలాగే ఇక్కడ మాస్టర్‌ప్లాన్ కూడా కచ్చితంగా అమలు చేస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ అమలైతే ఆలయ రూపురేఖలే మారిపోతాయన్నారు. అర్చకుల జీతాలకు బదులు ఆలయ భూములు ఇచ్చే విషయాలు, ఆర్జిత సేవల టిక్కెట్లలో అర్చకుల షేర్లు చెల్లింపు, నిత్యాన్నదాన పథకంలో ఏడాది వివరాల రికార్డులను తన దృష్టిలో ఉంచాలని ఆదేశించారు. అలయంలో అధికార సిబ్బంది కొరత ఉందని, రికార్డు అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లు లేరని ఈవో శ్యామలాదేవి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఆలయంలో బయోమెట్రిక్ విధానం పక్కాగా అమలు చేయాలని మంత్రి ఆదేశించారు.
స్థానికులు అవగాహనతో మెలగాలి
స్థానిక ఇంద్రపుష్కరిణి వద్ద పరిస్థితి దారుణంగా ఉంందని స్థానికుడైన సూరు జనార్దనరావు మంత్రి మాణిక్యాలరావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్థానికులు అవగాహనతో మెలగాలన్నారు. మంత్రి వెంట బీజేపీ జిల్లా ముఖ్య నేతలు పైడి వేణుగోపాలం, దుప్పల రవీంద్ర బాబు, పూడి తిరుపతిరావు, కోటగిరి నారాయణ రావు, ప్రొఫెసర్ హనుమంతు ఉదయ్ భాస్కర్ పాల్గొన్నారు.