'ఆంధ్రాకు లక్ష.. మాకు పదివేలేనా'
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అంటేనే అన్ని రాష్ట్రాలను సమానంగా చూసుకోవాలని ఇంత వివక్ష పాటించకూడదని టీఆర్ఎస్ పార్టీ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బీజేపీకి తెలంగాణ అంటే వివక్ష ఉందని తేలిపోయిందని, అందుకే తెలంగాణకు కేవలం పది వేల ఇళ్లను మాత్రమే మంజూరు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం లక్షకు పైగా ఇళ్లను కేటాయించారని అన్నారు. తెలంగాణకు కేటాయించిన ఇళ్లు ఆంధ్రకు కేటాయించిన మొత్తం ఇళ్లలో పదిశాతం కూడా లేవని అన్నారు. అందుకే ఇక బీజేపీకి మాట్లాడే హక్కు లేదని చెప్పారు.
ఇక కాంగ్రెస్ నేత జానారెడ్డి కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయన ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే దూరం జరిగానని చెప్తున్నారని, అసలు అలాంటి పదవులు ఏనాడైనా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. అసలు జానారెడ్డికి కూడా మాట్లాడే హక్కు లేదని అన్నారు. పేదవారి కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు ఏనాడైనా ఇచ్చారా అన్నారు. తాము రాగానే పేదల గురించి ఆలోచించడం మొదలుపెట్టామని, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని, వారి సంక్షేమం కృషి చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో మిగులు విద్యుత్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని త్వరలోనే ఇతర రాష్ట్రాలకు విద్యుత్ విక్రయించే స్ధాయికి తెలంగాణ చేరుకుంటుందని చెప్పారు.