నంద్యాలకు కేంద్ర బలగాలు పంపాలన్న ఈసీ ప్రతిపాదనను వైఎస్సార్ సీపీ స్వాగతించింది.
కర్నూలు: నంద్యాలకు కేంద్ర బలగాలు పంపాలన్న ఎన్నికల సంఘం(ఈసీ) ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. మంగళవారం వీరిద్దరూ విలేకరులతో మాట్లాడుతూ.. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. మంత్రులే స్వయంగా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని అన్నారు.
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కోట్లాది రూపాయలు పంచేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు, మంత్రులపై ఎన్నికల సంఘం నిఘా పెంచాలని విజ్ఞప్తి చేశారు.