
'చింతమనేని చిందులు'
ఏలూరు (మెట్రో): ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దురహంకారం మరోమారు బయటపడింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలపై చింతమనేని ప్రభాకర్‌తోపాటు ఆయన అనుచరులు విరుచుకుపడ్డారు. గౌరవప్రదమైన ప్రభుత్వ విప్ పదవిలో ఉండి దుర్భాషలాడారు. సమస్యలు పరిష్కరించి ఆదుకోండని విన్నవించుకున్న వారిపై పత్రికల్లో రాయలేని భాషలో అవమానకరంగా మాట్లాడారు.
గుడ్లు, పప్పులు అమ్మేసుకునే మీకెందుకే జీతాలు అంటూ మొదలుపెట్టిన చింతమనేని.. 'అసభ్య పదం..... మీకు వచ్చేవి సరిపోక జీతాల కోసం రోడ్లెక్కారా. మాకే జీతాలు లేవు. చంద్రబాబు అద్దె ఇంట్లో ఉంటున్నారు. బెడ్‌రూమ్‌లు ఇస్తాం. కావాలంటే తీసుకోండి' అంటూ నోటికొచ్చినట్లు తిట్టారు. 'పెంచిన జీతాలు కాదయ్యా.. ప్రతి నెలా ఇచ్చే జీతాలే ఇచ్చి మూడు నెలలైంది' అని ఓ పెద్దావిడ చెబుతుండగా.. మళ్లీ అసభ్య పదజాలం... ఆ వెంటనే సీఐటీయూ డివిజన్ నాయకుడు ఎం సుందరబాబును ఉద్దేశించి ఆడవాళ్లను మూటగట్టి తీసుకొచ్చి ప్రభుత్వంపై ఉసిగొల్పుతావా అంటూ రెచ్చిపోయారు.