అమ్మ పాలు.. అమృతం!
సాక్షి, సిటీ బ్యూరో: నవ మాసాలు మోసిన తల్లి.. తన బిడ్డ ఈ లోకంలో అడుగు పెట్టగానే ఆరోగ్యాన్ని...రోగ నిరోధక శక్తిని కానుకగా ఇవ్వాలంటున్నారు వైద్యులు. ఇది కేవలం తల్లి పాలతోనే సాధ్యమని చెబుతున్నారు. పుట్టిన 15 నిమిషాల నుంచి గంట వ్యవధి లోపు ఇచ్చే ముర్రుపాలు చిన్నారులకు రోగ నిరోధక ఔషధమని అంటున్నారు. దాదాపు 30 శాతం శిశు మరణాలను తగ్గించేది ఇవేనని యూనిసెఫ్ నివేదిక స్పష్టం చేసింది. ముర్రుపాలు పట్టకూడదనే అపోహతో చాలా మంది గ్రామీణ మహిళలు గంటలోపు పాలు పెట్టనివ్వరు. నిజానికి ఆ రెండు మూడు చుక్కల పాలలాంటి నీళ్లు బిడ్డకు వారం రోజులకు సరిపడా పౌషక విలువలను అందిస్తాయి.
పోషకాలు పుష్కలం
బిడ్డ పుట్టిన 15 నిమిషాల నుంచి మూడు రోజుల పాటు వచ్చే ముర్రుపాలల్లో అత్యంత ఆరోగ్యవంతంగా ఉంచగలిగే పోషక విలువలు ఉంటాయి. ఆరు నెలల వరకు ఎంత ఎండాకాలమైనా సరే నీళ్లు కూడా ఇవ్వకుండా తల్లి పాలే ఇవ్వాలి. ఇది బిడ్డ ఎదుగుదలకు అత్యంత కీలకం. తల్లి పాలల్లో బాక్టీరియా ఉండదు. ఎలాంటి పోషకాలు అవసరమో... ఎంత వేడి కావాలో... ఎటువంటి రోగ నిరోధకాలు అవసరమో... ఎంత తియ్యదనం కావాలో తల్లి పాలలో సహజసిద్ధంగా లభిస్తాయి. పిల్లల్లో మలబద్ధకం ఉండదు. పొట్టలో గ్యాస్ తయారు కాదు. డయేరియా, దగ్గు, జలుబు లాంటివి దరిచేరవు. ఇన్‌ఫెక్షన్లు సోకవు. రెండు గంటలకొకసారి తప్పనిసరిగా తల్లి బిడ్డకు పాలివ్వాలి. 24 గంటల్లో 8 సార్లు తప్పనిసరిగా పాలు ఇవ్వాల్సి ఉంటుంది.
– డాక్టర్ బాలాంబ, గైనకాలజిస్ట్
మానసిక వికాసానికి తోడ్పాటు
భవిష్యత్‌లో బిడ్డకు మానసిక సమస్యలు రాకుండా తల్లి పాలు నిరోధించగలుగుతాయి. పర్సనాలిటీ డిజార్డర్స్‌ని దూరం చేస్తాయి. కూలి పని చేసుకునే తల్లులకు గ్రామీణ ఉపాధిహామీ పథకంలో కూడా పిల్లల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న నిబంధన ఉంది. కానీ ఇదెవ్వరూ పట్టించుకోరు. ఐటీæసంస్థలు, కార్పొరేట్ ఆఫీసుల్లోనూ బిడ్డలకు ప్రత్యేకించి సంరక్షణ కేంద్రాలు 99 శాతం లేవనే చెప్పాలి. ఎన్ని అవగాహనా కార్యక్రమాలు పెట్టినా అందుకు అనుగుణమైన వాతావరణాన్ని కల్పించడం అవసరం.
–డాక్టర్ రమాదేవి, కన్వీనర్, జనవిజ్ఞాన వేదిక
క్యాన్సర్ దూరం
వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ అనే సంస్థ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే అంశాల్లో బిడ్డలకు పాలివ్వడం కూడా ఒకటని ప్రచారం చేస్తోంది. పాలిచ్చే తల్లుల కంటే పాలివ్వని వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా నమోదవుతున్నట్టు ఈ సంస్థ ప్రకటించింది. పుట్టిన గంటలోపు పాలివ్వకపోవడం వల్లనే తల్లుల్లో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. మిల్క్ బ్రెడ్, తృణధాన్యాలు, ఓట్స్ లాంటివి తక్షణమే తల్లిపాల ఉత్పత్తికి దోహదం చేస్తాయి. అందం తరిగిపోతుందన్నది కూడా అపోహే.
–డాక్టర్ భావన కాసు