కులవృత్తిని మట్టుబెట్టజూస్తే ఖబడ్దార్
గౌడ సమ్మేళనంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్
♦ గౌడలను ప్రభుత్వానికి దూరం చేయజూస్తే ఊరుకోం
♦ అన్యాయం జరిగితే సహించం: ఎంపీ బూర
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: విశ్వాసానికి ప్రతీకగా నిలిచే గౌడ కులస్తులను, కల్లు వృత్తిదారులను ప్రభుత్వానికి దూరం చేసేందుకు, కులవృత్తిని మట్టుబెట్టేందుకు కొందరు అధికారులు పనిగట్టుకుని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఇందుకు వత్తాసు పలుకుతున్న కొందరు నాయకుల బండారం కూడా త్వరలో బయటపెట్టి తీరతామని హెచ్చరించా రు. మంగళవారం మహబూబ్‌నగర్‌లోని జెడ్పీ మైదానంలో జరిగిన జిల్లా గౌడ సమ్మేళనం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అణగారిన, బడుగు, బలహీన వర్గాలకు అండ గా ఉండటమే తాను చేసిన నేరంగా కొందరు చిత్రీకరించి రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అలాంటి వారి కుట్రల ను చేధిస్తామన్నారు.
తమ ప్రాణాలు పణంగా పెట్టయినా కులవృత్తులను కాపాడుకుంటామ న్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో తమకు ప్రాధాన్యమివ్వాల ని సీఎంను కోరతామని, త్వరలో ఆయన సమక్షంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని ప్రకటించారు. ‘‘కులానికి, ధనానికి మేం తక్కువేమోగానీ వ్యక్తిత్వానికి మమ్మల్ని మించిన వారు లేరు. అదే ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవంతో గౌడ సమస్యలపై నిరంతరం పోరు సాగిస్తా’’ అని చెప్పారు.
‘కార్పొరేట్’ కుట్ర: కల్లు వృత్తిని కాపాడుకోవాలని సాక్షాత్తు కేసీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నా అధికారులు వక్రభాష్యం వెతుకుతూ ఆ వృత్తిని నిర్మూలించడం ద్వారా కార్పొరేట్ లిక్కర్ కంపెనీలకు చేయూతనిచ్చేందుకు కుట్ర పన్నుతున్నారని శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. కల్తీ పేరుతో కల్లు గీత కార్మికులను ఇబ్బంది పెట్టలనే ఉద్ధేశంతో కొందరు అధికారులు పనికట్టుకుని చేస్తున్న ప్రయత్నాలను ఇక చూస్తూ ఊరుకోబోమన్నారు. తాము తలచుకుంటే అధికారులు బండారం బయట పెడతామని, కులవృత్తులను అణచివేతకు ప్రయత్నిస్తే దాడులు చేయడానికి సైతం వెనుకాడబోమని అన్నారు.
‘‘కల్లులో కల్తీ ఉందని పదే పదే దుష్ర్పచారం చేస్తున్న అధికారులు, కొందరు నేతలు ఇప్పటిదాకా సంభవించిన మరణాల్లో ఏ ఒక్కటైనా కల్లు వల్లే జరిగిందని పోస్టుమార్టం సహా ఏ రిపోర్టులోనైనా నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధమే. అవసరమైతే కులవృత్తికి స్వస్తి చెప్పడానికీ సిద్ధం. రాజకీయాల్లో తన ఉన్నతిని తట్టుకోలేక తప్పుడు ఆరోపణలతో కుట్రలు చేస్తూ పత్రికల్లో రాయించి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తాము తలుచుకుంటే గీతకార్మికులను ఇబ్బంది పెట్టే ఏ అధికారి పొలిమేర దాటలేరని ఆయన హెచ్చరించారు.
ఐక్యతే మహాబలం
సమస్యల సాధనకు ఐక్యతే ప్రధాన ఆయుధమని భువనగిరి టీఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. అనేక ప్రాంతాల్లో గౌడ కులస్తులపై ఆబ్కారీ అధికారులు దాడులకు పాల్పడి వేధిస్తున్నా, వారి ఓట్లతో గెలుపొందిన నేతలు దీన్ని ప్రశ్నించ కపోవడం దారుణమన్నారు. ‘‘ఏదేమైనా కల్లు వృత్తిని కాపాడుకుని తీరుతాం. గౌడలకు అన్యాయం జరిగితే సహించేదే లేదు’’ అన్నారు.