సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఎట్టకేలకు ఉత్కంఠకు తెరపడింది. టీఆర్‌ఎస్ అధిష్టానం నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కొన్ని రోజులుగా నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న టీఆర్‌ఎస్ అభ్యర్థిపై నెలకొన్న అనిశ్చితి తొలగింది. మునుగోడు నియోజకవర్గంలోని చల్మెడ గ్రామానికి చెందిన వేమిరెడ్డి నర్సింహారెడ్డిని టీఆర్‌ఎస్ పోటీకి పెడుతోంది. గురువారం రాత్రి ఏడున్నర గంటల దాకా జిల్లా నేతలతో సమావేశమైన ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చివరకు వేమిరెడ్డి నర్సింహారెడ్డి అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇన్నాళ్లూ ఏ పార్టీలో లేని నర్సింహారెడ్డిని గులాబీ కండువాకప్పి పార్టీలో చేర్చుకుని, బీ–ఫారం ఇచ్చి పంపారు. భువనగిరి స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పేరునే ఖరారు చేశారు. ఆయన పోటీ చేయడం ఖాయమని ముందునుంచే పార్టీ వర్గాల్లో ఓ అవగాహన ఉన్నా.. గురువారం ఆయనకు బీ–ఫారం అందజేయడంతో అధి కారికంగా ప్రకటించినట్లు అయ్యింది. ఆయన రెండోసారి భువనగిరి నుంచి ఆయ న తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఇక, నల్లగొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి ముందు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తూ నిర్ణయం ప్రకటించారు. ఈసారి నల్లగొండ ఎంపీ స్థానం నుంచి తటస్థులను పోటీకి పెట్టాలన్న కసరత్తు రెండు వారాలుగా సాగుతోందని సమాచారం. దీనిలో భాగంగానే హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌లోని రాజధాని బ్యాంక్ చైర్మన్‌గా ఉన్న వేమిరెడ్డి నర్సింహారెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది.
తర్జన.. భర్జన!
కాంగ్రెస్‌నుంచి ఇప్పటికే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్లగొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ పేరును ఆ పార్టీ ప్రకటించాక టీఆర్‌ఎస్ నాయకత్వం పునరాలోచనలో పడిందని అంటున్నారు. పీసీసీ అధ్యక్షుడిపై బలమైన అభ్యర్థినే పెట్టాలని భావించి సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని తిరిగి పోటీలో నిలపాలన్న ఆలోచనకు వచ్చారని చెబుతున్నారు. ఇప్పటికే మూడు సార్లు ఎంపీగా గెలిచిన గుత్తా సుఖేందర్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ నుంచి 1.93లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మూడో స్థానానికే పరిమితమైంది
. ఆ తర్వాత గుత్తా టీఆర్‌ఎస్‌లో చేరారు. మూడు సార్లు ఎంపీగా పనిచేసిన సీనియారిటీ, నియోజకవర్గంలో పట్టు, గత ఎన్నికల్లో సాధించిన మెజారిటీ .. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఉత్తమ్ కుమా ర్ రెడ్డిపై పోటీకి పె ట్టాలన్న చర్చ పార్టీ లో జరిగిందని చె బుతున్నారు. అయి తే, అప్పటికే తమకో అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని సంప్రదించిన వేమిరెడ్డి నర్సింహారెడ్డి పేరును పరిశీలనలోకి తీసుకున్నా.. చివరి నిమిషయం దాకా ఏ నిర్ణయమూ ప్రకటించలేదు. గురువారం మధ్యాహ్నం వేమిరెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చినా.. సాయంత్రం కల్లా సీన్ మారింది. జిల్లా నాయకులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో భేటీ అయ్యాక.. చర్చ జరిపాక, చివరకు వేమిరెడ్డి నర్సింహారెడ్డి పేరును ఖరారు చేశారని పార్టీ వర్గాల సమాచారం.
భువనగిరి నుంచి ... బూర
భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి డాక్టర్ బూర న ర్సయ్యగౌడ్ రెండో సారి పోటీ చేయనున్నారు. ఆయన అభ్యర్థిగా గురువారం పార్టీ అధినేత కేసీఆర్ నుం చి బీ–ఫారం అందుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ల జేఏసీ నాయకుడిగా చురుగ్గా పనిచేసిన బూరకు టీఆర్‌ఎస్ అధినేత తొలిసారి పార్టీ టికెట్ ఇ చ్చారు.
ఆయన ఆ ఎన్నికల్లో నాటి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విజయం సాధించి పార్లమెంట్‌లోకి అడుగు పెట్టారు. కాగా, ఈ సారి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కాంగ్రెస్ తమ అభ్యర్థిగా ప్రకటిం చింది. దీంతో నాడు తమ్ముడిపై పోటీ చేసి గెలిచిన బూర ఈ ఎన్నికల్లో అన్నపై పోటీ చేస్తున్నారు.
గుత్తాకు ... ఎమ్మెల్సీ అవకాశం
నల్లగొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి.. తనకు మరోసారి ఎంపీగా అవకాశం ఇవ్వాలని అధి నాయకత్వాన్ని అసలు కోరనే లేదని చెబుతున్నారు. ఆయన పార్టీలో చేరిన సమయంలోనే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రివర్గంలోకి తీసుకుంటా మన్న హామీ ఇచ్చారని ఆయన అనుచర వర్గం చెబు తోంది. ఆ ప్రభుత్వంలో ఆయనకు మంత్రిగా అవకాశం ఇవ్వలేని కారణంగానే రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా కేబినెట్ ర్యాంకుతో పదవి ఇచ్చారని విశ్లేషిస్తున్నారు.
అయితే.. ఇటీవలే ముగిసిన ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆయనకు అవకాశం దక్కలేదు. దీంతో తిరిగి ఎంపీగానే పోటీ చేయిస్తారని ప్రచారం జరిగింది. ఈ కారణంగానే గురువారం సాయంత్రం వరకూ ఆయన పేరు పార్టీ అధినేత వద్ద పరిశీలనలోనే ఉందని అంటున్నారు. ఆఖరుకు వేమిరెడ్డి నర్సింహారెడ్డి పేరును ఖరారు చేశారు. గుత్తాకు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఏప్రిల్ మొదటి వారంలో కొన్ని స్థానాలకు జరిగే మండలి ఎన్నికల్లో గుత్తా ఎమ్మెల్సీగా పోటీ చేయనున్నారని పార్టీ వర్గాల సమాచారం.
భువనగిరి ఎంపీ అభ్యర్థి బయోడేటా
పేరు: డాక్టర్ బూర నర్సయ్యగౌడ్
తల్లిదండ్రులు: లక్ష్మయ్య, రాజమ్మ
స్వగ్రామం: తాళ్లగడ్డ, సూర్యాపేట జిల్లా
భార్య: అనిత
కుమార్తె: రోహిత
విద్యాభ్యాసం: ఎంబీబీఎస్(ఉస్మానియా)
తెలంగాణ ఉద్యమంలో ప్రవేశం: డాక్టర్ జేఏసీని స్థాపించి అనంతరం డాక్ ప్రెసిడెంట్‌గా పని చేశారు.
రాజకీయ రంగంలో ప్రవేశం : 2014లో భువనగిరి ఎంపీ టికెట్ రావడంతో పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు.
వివిధ హోదాల్లో: స్టాండింగ్ కమిటీ ఆన్ లేబ ర్, కమిటీ ఆన్ వెల్ఫేర్ ఆఫ్ ఓబీసీఎస్, కన్సోలేటివ్ కమిటీ ఆన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్, ఇండ్రస్టీ, కన్సోలేటివ్ కమిటీ ఆన్ స్కిల్ డెవలప్‌మెంట్ సభ్యులుగా కొనసాగుతున్నారు.
నల్లగొండ ఎంపీ అభ్యర్థి బయోడేటా
పేరు : వేమిరెడ్డి నర్సింహారెడ్డి
స్వగ్రామం : చల్మెడ, మునుగోడు మండలం, నల్లగొండ
తల్లిదండ్రులు : లింగారెడ్డి, రామనర్సమ్మ
భార్య : ఇందిర, గృహిణి
సంతానం : ఇద్దరు కుమారైలు, ఒకరు డాక్టర్, మరొకరు రాజధాని బ్యాంక్ డైరెక్టర్
వృత్తి : రియల్‌ఎస్టేట్ వ్యాపారం, బ్యాంకుల నిర్వహణ. 1995లో రాజధాని బ్యాంక్ స్థాపన. ప్రస్తుతం బ్యాంక్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు. కోఆపరేటివ్ బ్యాంక్ జాతీయ డైరెక్టర్‌గా, వీఎన్‌ఆర్ గ్రూప్స్ అధినేతగా ఉన్నారు. 1984లో జరిగిన మునుగోడు మండల పరిష త్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment