- వ్యక్తిగత విమర్శలు చేస్తే సరైన సమాధానం చెబుతా
- 'దొరికిన దొంగ' రేవంత్ రెడ్డి
- సాంఘిక బహిష్కరణ చేయాల్సింది ఆయన్నే
నల్లగొండ : పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డిల గ్రూపు తగాదాల వల్లే తాను కాంగ్రెస్ పార్టీని వీడానని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్లగొండలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డిలను లక్ష్యంగా చేసుకుని గుత్తా ఘాటైన విమర్శలు చేశారు. '2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తమ్, కోమటిరెడ్డి పరస్పరం ఓడించుకోవాలని ప్రయత్నం చేశారు. ఒకరిపై మరొకరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. నాయకుల మధ్య నెలకొన్న ఈ గొడవల వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లింది. పార్టీలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలను భరించలేకనే విసిగి వేసారి పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది' అని ఆయన వివరించారు.
మీ నియోజకవర్గాల్లో ఎంపీలంటే కనీసం గౌరవం ఉండడం లేదని గుత్తా అన్నారు. చావుకు లేదా పెళ్లికి పోయినా మీ అంగీకారం ఉండాల్సిందేనని ఆయన విమర్శించారు. నియోజకవర్గాలను తమ సామ్రాజ్యాలుగా చేసుకొని ఏలుతున్నారు అని గుత్తా మండిపడ్డారు. 'మా దగ్గర మీ చిట్టాలు చాలా ఉన్నాయి.. కానీ చెప్పను. అది మా సంస్కృతి కాదు. ఇష్టానుసారంగా వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదు. సరైన సమాధానం చెబుతాం' అని హెచ్చరించారు.
ఉత్తమ్.. స్వశక్తి కలిగిన నాయకుడా?
కాంగ్రెస్ కార్యకర్తల త్యాగాల వల్లనే సుఖేందర్ రెడ్డి ఎంపీ అయ్యారని.. స్వశక్తి కలిగిన నాయకుడు కాదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలపై గుత్తా ఫైరయ్యారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో పనిచేసి రాత్రికి రాత్రే టికెట్ తెచ్చుకుని కోదాడలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఉత్తమ్ స్వశక్తి కలిగిన నాయకుడా..? అని గుత్తా ప్రశ్నించారు. తాను రెండు ఎన్నికల్లో ఎంపీగా గెలిచానంటే అందుకు ఉత్తమ్, కోమటిరెడ్డి, దామోదర్ రెడ్డి, జానారెడ్డిల సహకారం ఉన్న సంగతి వాస్తవమేనని చెప్పారు. ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు కట్టుబడి ఉన్నానని, ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా ఉప ఎన్నికకు వెళ్లి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరియైంది కాదని భావించి తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు ఎంపీ చెప్పారు.
రేవంత్.. దొరికిన దొంగ
పార్టీలు మారిన ఎంపీ గుత్తా, ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, రవీంద్ర కుమార్‌లను సాంఘిక బహిష్కరణ చేయాలని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎంపీ ఘాటుగానే బదులిచ్చారు. 'నువ్వు దొరికిన దొంగ.. జైలుకు వెళ్లొచ్చిన చరిత్ర నీది! నోరు మూసుకుని నీ పని నువ్వు చూసుకో.. సాంఘిక బహిష్కరణ చేయాల్సి వస్తే ముందు నిన్ను చేయాలి' అని గుత్తా హెచ్చరించారు. ఓటుకు నోటు కేసులో నెల రోజుల పాటు చర్లపల్లి జైలులో శిక్ష అనుభవించిన రేవంత్ రెడ్డి.. స్థాయికి మించి విమర్శలు చేయడం సరియైంది కాదన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ పచ్చి రాజకీయ వ్యభిచారానికి పాల్పపడుతున్నారని ఎంపీ విమర్శించారు.
నీ భార్యకు ఏం అర్హత ఉంది?: ఎమ్మెల్యే భాస్కర్‌రావు
అనామకుడైన భాస్కర్‌రావును మిర్యాలగూడ ఎమ్మెల్యేగా గెలిపించింది కాంగ్రెస్ కార్యకర్తలేనని పీసీసీ నేత ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే భాస్కర్ రావు కొట్టిపారేశారు. 'నీ భార్య పద్మావతికి ఏం అర్హత ఉందని కోదాడ ఎమ్మెల్యే సీటు తెప్పించుకున్నావ్?' అని భాస్కర్ రావు ప్రశ్నించారు. 44 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాకంటే నువ్వు చాలా జూనియర్ అని ఉత్తమ్‌ను ఉద్దేశిస్తూ విమర్శలు చేశారు. సమావేశంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.