'పవన్ కల్యాణ్ను కోరలేదు'
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై కాపు సామాజిక వర్గం నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆదివారం అనంతపురంలో నిప్పులు చెరిగారు. టీడీపీ నేతలు దిగజారి మాట్లాడితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే కాపులకు న్యాయం చేసేవారని ముద్రగడ అభిప్రాయపడ్డారు. కాపులకు ఏటా రూ. 1000 కోట్లు ఇస్తామన్నారు... ఆ హామీలు నెరవేర్చనందునే తాము ఉద్యమబాట పట్టినట్లు ఆయన వివరించారు.
కాపు ఉద్యమానికి సహకరించమని తాను జనసేన పార్టీ అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ని కోరలేదని చెప్పారు. తనకు వ్యక్తిగత ఎజెండా లేదని... రాజకీయాలకు దూరం అని ఆయన వెల్లడించారు. తన వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నారన్నది అవాస్తవమన్నారు.
జూన్లో ఉద్యమ కార్యాచారణ ప్రకటిస్తామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఉద్యమం చేసినప్పుడు... తన వెనుక చంద్రబాబు ఉన్నారనుకోవాలా అని తనపై ఆరోపణలు గుప్పిస్తున్న టీడీపీ నేతలపై మండిపడ్డారు. కాపు ఉద్యమం అణచి వేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ముద్రగడ ఆరోపించారు. కాపులు బానిసలు, సంఘ విద్రోహ శక్తులు కాదని ఆయన స్పష్టం చేశారు. తుని కేసులో కాపులను పోలీసులు వేధిస్తున్నారంటూ ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు.