పొదుపు.. మదుపు.. అదే భవితకు మేలిమలుపు
పొదుపు.. మదుపు.. అదే భవితకు మేలిమలుపు
Published Sun, May 28 2017 11:06 PM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM
మదుపరులకు నిపుణుల హితవు
సాక్షిమైత్రీ ఇన్వ్‌స్టర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మదుపరుల సదస్సు
భానుగుడి (కాకినాడ): పిల్లల్ని బాగా చదివించాలి.. పెళ్లిళ్లు చేయాలి.. చక్కని ఇల్లు కొనుక్కోవాలి.. పదవీవిరమణ తర్వాత ఎవరిపైనా ఆధారపడకుండా జీవించాలి. ఇవీ ప్రతీఒక్కరి కోరికలు. ఈ కోరికలు తీరాలంటే పొదుపు ఎంతముఖ్యమో మదుపు కూడా అంతే ముఖ్యమంటున్నారు నిపుణులు. పెట్టుబడులు ఎలా ఉండాలి? స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది? మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి? డీమాట్ తదితర అంశాలపై సందేహాలను తీరుస్తూ నిపుణులు మదుపుదారులకు అవగాహన కల్పించారు. సాక్షి మైత్రీ ఇన్వెస్టర్స్ క్లబ్, సీడీఎస్‌ఎల్, ఎస్‌బీఐ క్యాప్ సెక్యూరిటీస్ సంయుక్తంగా కాకినాడ ఆర్‌ఎల్ గ్రాండ్‌లో నిర్వహించిన మదుపరుల అవగాహన సదస్సు దీనికి వేదిక అయింది. ‘40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి ఒక్కరికీ రెండు ఆదాయాలు ఉండాలి. అలా ఉండాలంటే పొదుపు ఒక్కటే సరిపోదు. భవిష్యత్తులో ధరలను తట్టుకునేలా రాబడి వచ్చే సాధనాల్లో దాన్ని మదుపు చేయాలి.’ అని సీడీఎస్‌ఎల్ రీజనల్‌మేనేజర్ శివప్రసాద్ వెనిశెట్టి అన్నారు.
స్టాక్ మార్కెట్లో మదుపుచేయాలంటే...
స్టాక్ మార్కెట్ అనగానే చాలామందికి జూదమనే భావన ఉంది. అయితే ఈ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే మందు అన్నింటిపైనా అవగాహన ఏర్పరచుకోవాలి. ఆతర్వాతే ఎంతకాలానికి మార్కెట్లో మదుపు చేస్తామనే వ్యూహంతోనే అడుగు వేయాలి. ట్రేడింగ్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. కొన్నిసార్లు షేర్ల ఎంపికలో పొరపాట్లు జరగవచ్చు. రెండు షేర్లు కొంటే ఒకదాని ధర పడిపోయి మరోటి పెరిగితే సాధారణంగా పెరిగిన షేర్లను అమ్ముతుంటారు. తగ్గిన షేరును వదిలించుకోవడం ద్వారా మరింత నష్టపోకుండా ఉంటాం. కంపెనీ మూలాలు బలంగా ఉంటే తగ్గినా పెరిగే అవకాశం ఉంది. వాటిని వదులుకోవద్దు.
స్టాక్‌మార్కెట్లో మదుపు చేయాలనుకునే వారికి మందుగా ఉండాల్సింది డీమ్యాట్‌ఖాతా. పాన్‌కార్డు ఉన్న వారెవరైనా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఇందులో ఎలక్ట్రానిక్ రూపంలో షేర్లను భద్రపరచుకోవచ్చు.
– షేర్ మార్కెట్‌లోకి రూ.500తో ప్రవేశించవచ్చు. మదుపరులు తమ వయస్సు, నష్టాన్ని భరించే సామర్థ్యం ఆధారంగా పథకాలను ఎంచుకోవాలి.
– చాలామంది 25–60 ఏళ్ళ మధ్యనే సంపాదిస్తారు. 60 ఏళ్ళ తర్వాత ప్రశాంత జీవితం గడపాలంటే పెట్టుబడులను సవ్యమైన రీతిలో పెట్టడం ముఖ్యం.
––షేర్లు కొన్నాక క్రమం తప్పక సమీక్షించుకుని పనిచేయని వాటిని వదిలించుకోవాలి.
రాజీవ్‌గాంధీ ఈక్విటీ పొదుపు పథకం
కొత్తగా స్టాక్ మార్కెట్లో ప్రవేశించే వారికి రాజీవ్‌గాంధీ ఈక్విటీ పొదుప పథకం అందుబాటులో ఉంది. వార్షికాదాయం రూ.12 లక్షల లోపు ఉండి డీమ్యాట్ ఖాతా లేనివారు పెట్టుపబడులు పెట్టనివారు ఇందులో చేరేందుకు అర్హులు. దీని ద్వారా నవరత్న, మహారత్న, మినీరత్న కంపెనీలు నిర్దేశిత మ్యూచువల్ ఫండ్ ప«థకాల్లో మదుపు చేయవచ్చు. పెట్టుబడిలో 50 శాతం మేరకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సిజీజీ కిందపన్ను మినహాయింపు వర్తిస్తుంది. గరిష్టంగా రూ.50 వేలు వరకు మదుపుచేయవచ్చు. 1990 నుంచి ఇప్పటివరకు 17 శాతం సీఏజీఆర్ రిటర్న్స్ వచ్చాయి. స్టాక్ మార్కెట్‌పై అవగాహన లేకున్నా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ప్రతి ఒక్కరూ సులభంగా ఇన్వెస్ట్‌చేయవచ్చు. నిపుణులైన ఫండ్ మేనేజర్ పర్యవేక్షణలో మదుపరులు సొమ్మును నిప్టీలో టాప్ 50కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ సెబీ నియంత్రణలో కొనసాగుతుంటాయి. మదుపరుల సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుంది. 80సీ సెక్షన్ కింద రూ.1.5లక్షల వరకు మ్యూచువల్ ఫండ్స్‌తో పెట్టుబడి చేసి పన్ను ప్రయోజనాలు సైతం పొందవచ్చు.
సిస్టమ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఐపీ)
ఎస్‌ఐపీల ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం లేకుండా మంచి రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. నెలకు రూ. 5 వేలు చొప్పున 10 ఏళ్ల పాటు ఎస్‌ఐపీతో మ్యూచువల్ ఫండ్స్‌తో రూ.6లక్షలు ఇన్వెస్ట్ చేస్తే సుమారు రూ.17లక్షలు రిటర్న్స్ వస్తాయి. నెలకు రూ.5వేలు చొప్పున 15ఏళ్లు ఇన్వెస్ట్ చేస్తే సుమారు రూ.63 లక్షల రిటర్న్స్ వస్తాయి.
ప్రయోగాత్మక డీమ్యాట్
చిన్న ఇన్వెస్టర్లను దృష్టిలో ఉంచుకొనిబేసిక్ డీమ్యాట్ అకౌంట్ (బీఎస్‌డీఏ )2012 అక్టోబర్ ప్రారంభించారు.డీమ్యాట్ అకౌంట్లో రూ.50వేల లోపు పోర్టు పోలియోలో ఉంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్(ఏఎంసీ) చెల్లించనవసరం లేదు. రూ.50వేలు నుంచి రూ.2లక్షలలోపు సంవత్సరంలో ఒక్కరోజు ఉన్నా రూ.100ఏఏంసీ చెల్లించాలి. అదే రోజు రెండు లక్షల రూపాయల పైబడి ఉంటే రెగ్యులర్ ఏఎంసీ చెల్లించాలి. ఈ సదుపాయాలన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మదుపరులకు ఒకే ఒక్క డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. మ్యూచువల్ ఫండ్‌కు సంబంధించిన అకౌంట్ స్టేట్ మెంట్లను కూడా డీమ్యాట్ అకౌంట్లోకి మార్చుకోవడానికి వీలుంది. అలాగే ఎక్సేంజ్ ప్లాట్‌ఫాం ద్వారా మ్యూచువల్ ఫండ్‌లను కొనుగోలు అమ్మకాల చేసుకోవడానికి అవకాశం ఉంది. మన ఖాతాను నిలుపుదల చేయాలనుకున్నపుడు ఫ్రీజ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ ఏఎస్‌ఐ అనే సదుపాయం ద్వారా డీమ్యాట్ అకౌంట్ హోల్డర్ తన స్టేట్‌మెంట్‌ను నేరుగా సీడీఎస్‌ఎల్ వెబ్‌సైట్‌లో చూసుకునే అవకాశం కల్పిస్తుంది.
మ్యూచువల్ ఫండ్స్‌తో ప్రయోజనమే..
బ్యాంక్ డిపాజిట్స్, పీపీఎఫ్, ఈపీఎఫ్, పోస్టాఫీసులో చేసే పెట్టుబడులపై 8నుంచి 9శాతం ఆదాయం వస్తుందని,మ్యూచువల్ ఫండ్స్‌లో అధిక ఆదాయం ఆర్జించవచ్చని ఎల్.కృష్ణకుమార్( సీనీయర్ మేనేజర్ ఎస్‌బీఐ,మ్యూచువల్ ఫండ్స్)అన్నారు. 1980 నుంచి ఇప్పటివరకు 17శాతం సీఏజీఆర్ రిటర్న్స్ వచ్చాయన్నారు. స్టాక్ మార్కెట్‌పై అవగాహన లేకున్నా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు ప్రతి ఒక్కరూ సులభంగా ఇన్వెస్ట్ చేయవచ్చన్నారు. నిపుణులైన ఫండ్ మేనేజర్ పర్యవేక్షణలో మదుపరుల సొమ్మును నిఫ్టీలో టాప్ 50 కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తారన్నారు. మ్యూచువల్ ఫండ్స్‌తో సెబీ నియంత్రణలో కొనసాగుతుంటాయని, దీనివల్ల మదుపరుల సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుందన్నారు. 80సీ సెక్షన్ కింద రూ. 1.5లక్షల వరకు పెట్టుబడి పెట్టి ప్రయోజనం పొందవచ్చన్నారు.
ఇన్వెస్ట్‌మెంట్ అలవాటు చేసుకోవాలి
ఇన్వెస్ట్‌మెంట్ కల్చర్ అలవాటు చేసుకుంఏ మదుపర్లకు ఎంతో మంచిదని టి.జగన్మోహనరెడ్డి (కాకినాడ ఏరియా మేనేజర్ ఎస్‌బీఐ క్యాప్ సెక్యూరిటీ)పేర్కొన్నారు. స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులపై అవగాహన వచ్చిన తర్వాత తెలిసిన కంపెనీల్లో షేర్లు కొనుగోలు చేయడం ఉత్తమమని ఆయన సూచించారు. ఎస్‌బీఐ షేర్లు, బాండ్లు, ఇతర మదుపు పథకాలను వివరించేందుకు ప్రత్యేక డెస్క్‌ను ఏర్పాటు చేశామన్నారు.
మంచి అవగాహన వచ్చింది.
షేర్లను కొనేముందు, కొన్న తర్వాత పాటించాల్సిన విషయాలపై మంచి అవగాహన వచ్చింది. ఇలాంటి సదస్సులను సాక్షి మరిన్ని నిర్వహించి మదుపుదారులకు మార్గదర్శకంగా నిలవాలి. ఎస్‌బీఐ అందిస్తున్న సేవలను చాలా చక్కగా ఏరియా మేనేజర్లు వివరించారు.
వాసిరెడ్డి శ్రీనివాస్, కాకినాడ
షేర్లు భద్రపరుచుకోవడంపై అవగాహన కుదిరింది
షేర్లను భద్రపరుచుకునే విధానంపైఈ సదస్సు ద్వారా అవగాహన ఏర్పడింది. షేర్‌మార్కెట్‌ను కళ్ళముందుంచారు. ఏ సమయంలో ఏవిధంగా స్పందిస్తే లాభదాయకమన్న విషయాలు తెలిశాయి. ఇటువంటి సదస్సులు గ్రామాల్లో విస్తరించాలి.
- సీహెచ్ సురేష్, కాకినాడ.
మరింత నేర్చుకున్నాను.
షేర్‌మార్కెట్ అనేది క్షణాల్లో మారిపోతుంటుంది. దీనికోసం నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. మన దగ్గర ఒక నిపుణుడు ఉండాలి. వారి సలహాలు ప్రతీసారీ అవసరమౌతాయి. నాకు సాక్షి మైత్రీ ద్వారా నిపుణుల సమూహాన్ని కలిసే అవకాశం వచ్చింది. నాలో దాగిన అనేక సందేహాలను నివృత్తి చేసుకోగలిగాను.
- పీఎంరావు, కాకినాడ
మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలిసింది.
మ్యూచువల్ ఫండ్స్ గురించి ఈ సదస్సు ద్వారా అవగాహన కలిగింది. ఎక్కడ ఫండ్స్ చేస్తే రిటర్న్స్ బాగా వస్తాయో తెలిసింది.ఇలాంటి సదస్సుల ద్వారా మాలాంటి వాళ్ళకు అవగాహన కల్పిస్తున్న సాక్షికి థ్యాంక్స్.
- పి.రాంబాబు
పెట్టుబడులపై అవగాహన వచ్చింది
పెట్టుబడులు పెట్టే విధానంలో అవలంబించాల్సిన పద్ధతులపై శివప్రసాద్ తెలిపిన అంశాలు చాలా బాగున్నాయి. పెట్టుబడులపై పూర్తి అవగాహన కలిగింది.
ఎంఎస్ నారాయణ, మదుపుదారు
తెలియని విషయాలు తెలిశాయి.
పెట్టుబడులు, ఇతర విషయాలకు సంబంధించి తెలియని విషయాలు చాలా తెలిశాయి. షేర్ మార్కెట్‌పై ఉన్న చెడ్డ అభిప్రాయం ఈ సదస్సు ద్వారా పోయింది. జాగ్రత్తలు పాటిస్తే పెట్టుబడులు ఎక్కడ పెడితో మంచిదో అర్ధమయ్యింది. డీమ్యాట్ గురించి నిపుణులు తెలిపిన విషయాలు అద్భుతం.
- శివకుమార్, మదుపుదారు
Advertisement
Advertisement