ఢిల్లీకి వెళుతున్న ‘నాయక్’
Published Tue, Jul 26 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
సాక్షి,విశాఖపట్నం:
సిటీకి కొత్త సీపీ వస్తే నెలన్నరగా కనీసం ఒక్కసారైనా కలవకుండా డిపార్ట్‌మెంట్ వారెవరైనా ఉంటారా.. సీపీగా ఎవరున్నా తనదారి తనదే అన్నట్లు అధికారిౖయెనా వ్యవహరిస్తారా..మాట వరసకు కూడా అలా అనుకోవడానికి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఎవరూ సాహసించరు. కానీ వాళ్లందరికీ విరుద్ధంగా జి.రాంగోపాల్ నాయక్ వ్యవహరించారు. అంతే కాదు ఉన్నతాధికారులతో ఏనాడూ సఖ్యతగా లేని ఆయన తాను తగ్గాల్సి రావడం ఇష్టం లేక ఏకంగా మాత సంస్థకు వెళ్లిపోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరడంతో ప్రభుత్వం అంగీకరించి ఢిల్లీకి పంపిచేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆది నుంచీ ఆయనంతే: రాంగోపాల్ నాయక్ ప్రస్తుతం జోన్–2 డీసీపీగా ఉన్నారు. ఢిల్లీ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి కావడంతో కేంద్ర స్థాయిలో అనేక మంది రాజకీయ నాయకులు, పెద్దలతో మంచి పరిచయాలున్నాయి. అండమాన్ నుంచి విశాఖ బదిలీౖయె వచ్చారు. గత సీపీ అమిత్‌గార్గ్ హయాంలో కొత్త జోన్లు ఏర్పడ్డాయి. వాటిలో జోన్–2కు నాయక్ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. కానీ అమిత్‌గార్గ్‌కు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. తన పరిధి దాటి వెళ్లి మరీ వివాదాల్లో తలదూర్చేవారు. ముఖ్యంగా ల్యాండ్ సెటిల్‌మెంట్లు ఆయనకు చెడ్డ పేరు తీసుకువచ్చాయి. దానికి తోడు రౌడీ షీటర్లపై దష్టి సారించి వారిని ఇబ్బందులకు గురి చేయడం ద్వారా ‘ప్రయోజనం’ పొందేవారనే విమర్శలు ఎదుర్కొన్నారు. కేవలం ఆ ప్రయోజనం కోసమే కొత్తగా రౌడీ షీట్లు తెరవమని సిబ్బందిపై ఒత్తిడి తెచ్చేవారని డిపార్ట్‌మెంట్ కోడై కూస్తోంది. ఇలాంటి అనేక వివాదాలు ముసిరినప్పుడు కూడా సీపీ అమిత్‌గార్గ్ నాయక్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. చర్యలకు ఉపక్రమించిపప్పుడల్లా ఉన్నత స్థాయిలో రాజకీయ నాయకుల నుంచి ఫోన్లు చేయించేవారని, వాటికి సమాధానం చెప్పలేక సీపీ సైతం మిన్నకుండిపోయేవారని సమాచారం. అయితే కొత్త సీపీగా టి.యోగానంద్ రావడంతో నాయక్ ఆలోచనలో పడ్డారు. యోగానంద్ వ్యవహార శైలి తెలుసుకుని ఆయనతో విభేదించి పని చేయలేమని గ్రహించారు. తన ఇష్టానుసారం ఉండటం కుదరనుకున్న నాయక్ ఆయన వస్తున్నారనగానే సెలవు పెట్టి వెళ్లిపోయారు. దాదాపు నెలన్నరగా పేరెంట్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఒక దశలో ఆశలు సన్నగిల్లడంతో ఈ నెల 11న తిరిగి విధుల్లో చేరాలనుకున్నారు. కానీ పెద్దల అండతో చివరికి అనుకున్నది సాధించుకున్నారు.
Advertisement