నిలువెల్లా నిర్లక్ష్యం | Neglect on entire system | Sakshi
Sakshi News home page

నిలువెల్లా నిర్లక్ష్యం

Published Thu, Nov 10 2016 5:20 PM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

నిలువెల్లా నిర్లక్ష్యం

నిలువెల్లా నిర్లక్ష్యం

*  కాలువ చివరి భూముల రైతులకు నీటి కష్టాలు
* దొంగలపాలైన యంత్ర పరికరాలు
నిరుపయోగంగా గార్డ్‌ రూములు
 పట్టించుకోని అధికారులు
 
వినుకొండ రూరల్‌ : నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ మేజర్ల పరిధిలోని రైతుల చివరి భూములకు నీరందేందుకు వీలుగా ఏర్పాటుచేసిన కెనాల్‌ ఆటో మిషన్లు కనుమరుగవుతున్నాయి. సాగర్‌ కుడి కాలువ నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పైలెట్‌ ప్రాజెక్టు కింద 2005లో సుమారు రూ.30 లక్షల వ్యయంతో గార్డ్‌ రూములు నిర్మించారు. నియోజకవర్గంలో 16 మేజర్లు ఉండగా ఎనిమిది మేజర్లపై గార్డు రూములు నిర్మించారు. అవి ఇప్పుడు అలంకారప్రాయంగా మిగిలాయి. ఇనిమెళ్ల, అంగలూరు, పెరుమాళ్లపల్లి, పెదకంచర్ల మైనర్, పేరూరపాడు, దొండపాడు, చీకటీగలపాలెం, పలుకూరు మేజర్‌ కాలువలపై అప్పటి అధికారులు గార్డ్‌ రూములు నిర్మించారు. వీటి వద్ద మేజర్లకు వచ్చే నీటి వివరాలు నమోదుచేసేందుకు తొట్లు ఏర్పాటు చేశారు. ఇవి అందించే వివరాలతో  వినుకొండ పట్టణంలోని ఎన్‌ఎస్‌పీ కార్యాలయంలోని కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం కావడంతో ఏ మేజర్లలో ఎంత పరిమాణంలో నీరు ప్రవహిస్తుంది.. అవసరమైన మేజర్లకు ఎంతమేర నీరు విడుదల చేయాలనేది స్పష్టంగా తెలియడంతో సమస్యను అధికారులు పరిష్కరించేవారు.
 
ఏ మేజర్‌కు ఎంతెంత..
ఇనిమెళ్ల మేజర్‌కు 23.17 క్యూసెక్కుల నీరందించే లక్ష్యంతో మూడు గార్డ్‌ రూములు, అంగలూరు 50.71 క్యూసెక్కులకు మూడు, పేరుమాళ్లపల్లి 194.8 క్యూసెక్కులకు 8, పెదకంచర్ల మైనర్‌ 70.12 క్యూసెక్కులకు మూడు, పేరూరపాడు 30.47 క్యూసెక్కులకు రెండు, దొండపాడు 56.04 క్యూసెక్కులకు రెండు, పలుకూరు 36.39 క్యూసెక్కులకు రెండు గార్డు రూములు నిర్మించారు. వీటి ప్రకారం రైతులకు నీరు సరఫరా చేయాల్సిఉంది. వీటి ఏర్పాటు అనంతరం వరుస కరువు, సిబ్బంది పర్యవేక్షణ కొరవడడంతో అవి మూలనపడ్డాయి. మారుమూల ప్రాంతాల్లోని గార్డ్‌ రూముల్లోని పరికరాలు దొంగలపాలయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతో కంట్రోల్‌ రూమ్‌ను సంవత్సరాల తరబడి పట్టించుకోకపోవడంతో యంత్ర పరికరాలు తుప్పుపట్టాయి. గ్రాఫ్‌ పనిచేయని పరిస్థితి నెలకొంది. సదాశయంతో లక్షలు ఖర్చు పెట్టి ఏర్పాటుచేసినా పట్టించుకునే నాథుడు లేక నిరుపయోగంగా మారాయి.
 
నీటి విడుదలలో అయోమయం..
ప్రస్తుతం తాగు, సాగునీటికి సాగర్‌ నీరు విడుదలతో మేజర్లకు నీటి విడుదల విషయంలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏ మేజర్‌కు ఎంత నీరు విడుదల చేయాలనే విషయంలో అయోమయం నెలకొంది. గతంలో గార్డ్‌ గదుల్లో ఏర్పాటు చేసిన రీడింగ్‌ యంత్రాల ద్వారా అధికారులు ఆయా మేజర్లకు నీరు విడుదల చేసేవారు.  కొన్ని మేజర్లకు నీటి సరఫరా అధికంగా ఉండగా.. మరికొన్నింటికి సరిపడా సరఫరా కావడం లేదు. దీంతో రైతులు సాగునీటి కోసం అనధికారిక తూములు, గండ్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కాలువ చివరి భూముల రైతులకు సాగు నీరందక అవస్థలపాలవుతున్నారు. నీటిపారుదల విషయంలో ఎన్‌ఎస్‌పీ అధికారులు చోద్యం చూస్తున్నారని చివరి భూముల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు స్పందించి కెనాల్‌ ఆటోమిషన్‌ను వినియోగంలోకి తెచ్చి రైతులకు నీరందేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 
 
రెండేళ్లుగా పనిచేయడం లేదు..
కెనాల్‌ ఆటో మిషన్‌ రెండేళ్లుగా పనిచేయడం లేదు. అక్కడక్కడ రీడింగ్‌ యంత్రాలను స్టోర్‌ రూమ్స్‌లో భద్రపరిచాం. మరికొన్ని రూమ్స్‌ను పరిశీలించాల్సి ఉంది. రానున్న రోజుల్లో ప్రతి మేజర్‌పై గార్డు రూములు ఏర్పాటుచేస్తాం. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపై ఉంది. రూముల్లో దొంగిలించిన యంత్రాలపై ఇప్పటికే 20–30 కేసులు నమోదు చేశాం. అయినా ఫలితం లేదు.
– వాసంతి, ఎన్‌ఎస్‌పీ ఈఈ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement