
వివాహమైన 16 రోజులకే..
ఖమ్మం అర్బన్: మహిళను దారుణంగా హత్య చేసిన సంఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. నగరంలోని తన ఇంట్లో కొణతాల రేణుక(25) రక్తపు మడుగులో పడి ఉండటాన్ని శనివారం సాయంత్రం ఆమె తల్లి పున్నమ్మ గుర్తించింది. నగరంలోని ముస్తాఫానగర్‌కు చెందిన రేణుక, కూసుమంచి మండలం జుజ్జుల్‌రావుపేటకు చెందిన వెంకన్న 16 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ నెల 11వ తేదీన శ్రీరాంనగర్‌లోని రోడ్డు నంబర్–6లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. రేణుకకు కొన్నేళ్ల క్రితమే చింతకాని మండలానికి చెందిన యువకుడితో వివాహమైంది. కొంతకాలం తర్వాత వారు విడిపోయారు. తర్వాత ఖమ్మంలో వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తున్న వెంకన్న ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
పెద్దలను ఒప్పించి 16 రోజుల క్రితమే వివాహం చేసుకున్నారు. శనివారం పున్నమ్మ తన కూతురుకు పలుమార్లు ఫోన్ చేసింది. ఫోన్ లిఫ్ట్ చేయకపోడంతో సాయంత్రం ఐదు గంటల సమయంలో కూతురు ఇంటికి వచ్చింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో ఇరుగుపొరుగువారిని అడగగా వెంకన్న ఉదయం 10 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి వెళ్లినట్లు స్థానికులు చెప్పారు. అనుమానం వచ్చి తాళం పగుల గొట్టగా అప్పటికే రక్తపు మడుగులో రేణుక నిర్జీవంగా పడి ఉంది. అతి దారుణంగా కూరగాయల కత్తితో మెడపై కోసి తర్వాత బాత్‌రూంలో రక్తపు చేతులను శుభ్రం చేసుకున్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. నగరం నడిబొడ్డున బహుళ అంతస్తుల భవనంలో మహిళ దారుణ హత్యకు గురికావడం, సుమారు 8 గంటలపాటు రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉండడం స్థానికంగా సంచలనం కలిగించింది. సంఘటన స్థలాన్ని డీఎస్పీ సురేష్‌కుమార్, సీఐ నాగేంద్రాచారి, ఎస్‌ఐలు రామారావు, మొగిలి సందర్శించారు. డాగ్ స్క్వాడ్‌తో పరిసరాలను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.