జాతీయ సాంకేతిక విద్యా సంస్థల(నిట్)లో సీట్లకోసం కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించే సంయుక్త సీట్ల కేటాయింపు అథారిటీ(జోసా-2016)
తాడేపల్లిగూడెం : జాతీయ సాంకేతిక విద్యా సంస్థల(నిట్)లో సీట్లకోసం కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించే సంయుక్త సీట్ల కేటాయింపు అథారిటీ(జోసా-2016) ప్రకారం జేఈఈ -2016 మెయిన్స్ ర్యాంకులను జూన్ 23న ప్రకటిస్తారని నిట్ ఏపీ రెసిడెంటు కో ఆర్డినేటర్ డాక్టర్ టి.రమేష్ శనివారం తెలిపారు. ర్యాంకుల ఆధారంగా అభ్యర్థులు తమ పేర్లను జోసాలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలలో అడ్మిషన్లు పొందవచ్చన్నారు. జూన్ 24వ తేదీ ఉదయం పది గంటల నుంచి 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు తమ ఐచ్ఛికాలను(ఆప్షన్స్) ఇవ్వవచ్చన్నారు. తొలి విడత సీట్ల కేటాయింపు జూన్ 30వ తేదీ ఉదయం పది గంటలకు ఉంటుందన్నారు.
తర్వాత క్రమంలో మూడు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మొదటి విడతలో ఎన్‌ఐటీలలో సీటు పొందిన అభ్యర్థులు రీజినల్ రిపోర్టింగ్ సెంటరైన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల విజయవాడలో రిపోర్టు చేయాలన్నారు. తాడేపల్లిగూడెంలో శ్రీ వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న ఏపీ నిట్‌లో సీటు పొందిన వారికి ఇది ప్రాంతీయ కేంద్రం కాదన్నారు. ఇక్కడ సీటు పొందిన వారు కూడా విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ కళాశాలలో మాత్రమే రిపోర్టు చేయాలన్నారు.
నాలుగు రౌండ్లుగా కౌన్సిలింగ్ ముగిసిన తర్వాత ఎన్‌ఐటీ ఏపీలో సీటు పొందిన అభ్యర్థులు ఫిజికల్ రిపోర్టింగ్ కోసం తాడేపల్లిగూడెంలోని శ్రీ వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలోని ఏపీ నిట్ ప్రాంగణానికి రావాలన్నారు. ఫిజికల్ రిపోర్టింగ్ షెడ్యూలు, మొదటి సంవత్సర తరగతుల ప్రారంభానికి సంబంధించిన సమాచారం తర్వాత ప్రకటిస్తామన్నారు. దీనిపై వివరాల కోసం ఎన్‌ఐటీ ఆంధ్రప్రదేశ్ వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌ఐటీఏఎన్‌డీహెచ్‌ఆర్‌ఏ.ఏసీ.ఇన్‌ను చూడాలన్నారు. సీట్ల కేటాయింపు ప్రక్రియ, అప్‌గ్రెడేషన్, రిపోర్టింగ్ వివరాలకోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. జేఓఎస్‌ఏఏ.ఎన్‌ఐసీ.ఇన్ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.