దుర్గగుడిపై రద్దీ అంతంతే
దుర్గగుడిపై రద్దీ అంతంతే
Published Fri, Aug 12 2016 11:58 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
విజయవాడ (ఇంద్రకీలాద్రి) :
ఒకవైపు పవిత్ర పుష్కరాలు, చెంతనే ఉన్న దుర్గమ్మ దర్శనానికి భక్తజనం పోటెత్తుతుందని అంచనా. అయితే ఆలయ ఉన్నతాధికారుల నిర్వాకం వల్ల వేలమంది భక్తజనం అమ్మవారి దర్శనానికి రాకుండానే వెనుదిరిగారు. తొలిరోజునే భారీ గందరగోళం చోటుచేసుకుంది. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం రద్దీ సాధారణమే. శ్రావణ మాసం రెండో శుక్రవారం, పుష్కర రద్దీ అయినప్పటికీ 50 వేల లోపే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
మరో వైపున పుష్కరాలలో 22 గంటలు అమ్మవారి దర్శనం కల్పిస్తామని చెప్పినప్పటికీ అది ఆచరణలో సాధ్య పడలేదు. గురువారం రాత్రి 9 గంటలకే అమ్మవారి దర్శనం నిలిపివేసినప్పటికీ శుక్రవారం తెల్లవారుజామున 1 గంటలకు దర్శనం కల్పించాల్సి ఉండగా , అలంకరణలో ఇబ్బందుల కారణంగా తెల్లవారుజామున 5 గంటల తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. సర్వ దర్శనంలో క్యూలైన్‌లోనే భక్తుల తాకిడి కనిపించగా, శీఘ్రదర్శనం, రూ. 5 వందల దర్శనం క్యూలైన్లలో రద్దీ నామమాత్రం.
బుద్ధా సొంత వాహనంలో బాలకృష్ణ
ఇక వీఐపీలను దేవస్థాన వాహనాలపైనే దుర్గగుడి పైకి తీసుకువచ్చి దర్శనం అయిన తర్వాత అదే వాహనంపై సాగనంపుతామని చెప్పారు. అయితే దీనిని ఉల్లంఘిస్తూ సీఎం చంద్రబాబు బావమరిది, ఎమ్మెల్యే బాలకృష్ణను స్థానిక ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తన వాహనంపై కొండపైకి తీసుకువెళ్లడంతో టోల్‌గేట్ వద్ద డ్యూటీలో ఉన్న ఆర్డీఓపై దుర్గగుడి ఈవోసూర్యకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీడియాపై ప్రతాపం
మీడియా ప్రతినిధులకు పాస్‌లు లేవనే కారణంతో పోలీసు అధికారులు వారిని పైకి వెళ్లకుండా అడ్డుకున్నారు. మీడియాకు దేవస్థానం నుంచి ఎటువంటి డ్యూటీ పాస్‌లు ఇవ్వలేదని చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు.ఈవోకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.
తొలి రోజు ఆదాయం రూ.8.38 లక్షలు
పుష్కరాల తొలి రోజున దుర్గగుడికి ప్రసాదాలు, టికెట్ల విక్రయాల ద్వారా రూ. 8,38,818ల ఆదాయం సమకూరింది. వీఐపీ దర్శనం టికెట్లు కేవలం 96 మాత్రమే విక్రయించారు. ఇక 68,400 లడ్డూలను విక్రయించగా రూ. 6.84 లక్షల ఆదాయం సమకూరింది. భవానీ ప్రసాదం విక్రయాల ద్వారా రూ. 71,850ల ఆదాయం సమకూరింది.
Advertisement
Advertisement