- వైద్య విధాన పరిషత్‌లో డాక్టర్లు, నర్సులు, ఇతర ఉద్యోగుల గగ్గోలు
- జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో పనిచేసే 6,500 మంది అవస్థ
- ట్రెజరీ ద్వారా వేతనాలు పొందకపోవడమే వారికి శాపం
- ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోలేదంటోన్న ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్
వారంతా జిల్లా, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేసే వైద్య సిబ్బంది. వేలాది మంది రోగులకు నిత్యం సేవలు అందిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ ఆరోగ్యకార్డులు ఇచ్చినా... వైద్య ఆరోగ్యశాఖలో పరిధిలో పనిచేసే ఈ వైద్య సిబ్బందికి మాత్రం ఆరోగ్యకార్డులు ఇప్పటికీ ఇవ్వలేదు. వారు వైద్య సేవలు చేసే చోటే... తమకు జబ్బు చేస్తే మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఇదీ వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల దుస్థితి.
వీరంతా ప్రభుత్వ ఉద్యోగులే అయినా వారికి ఆరోగ్యకార్డులు ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఒకటో తేదీన వేతనాలు అందుకుంటే... వీరు మాత్రం నెలాఖరు వరకు ఆగాల్సిన పరిస్థితి దాపురించింది. గుర్తింపు కార్డులు కూడా లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులుగా చెప్పుకోలేని దుస్థితి కూడా నెలకొంది. అంతేగాక మూడేళ్లుగా పదోన్నతులు లేవు. శాశ్వత ఉద్యోగుల పరిస్థితే ఇలా ఉంటే... అందులో పనిచేసే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి మరీ ఘోరం. ఇక కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు ప్రభుత్వం ఏమాత్రం ఆసక్తి చూపించడంలేదన్న ఆరోపణలున్నాయి.
105 వైద్య విధాన ఆసుపత్రులు... రాష్ట్రంలో 105 వైద్య విధాన పరిషత్ పరిధిలో ఆసుపత్రులున్నాయి. జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లన్నీ వైద్య విధాన పరిషత్ పరిధిలోనే పనిచేస్తున్నాయి. జిల్లాల్లో కీలకమైన వైద్య సేవలు అందించేది ఈ ఆసుపత్రులేననేది తెలిసిందే. ఆయా ఆసుపత్రుల్లో 6,500 మంది శాశ్వత ఉద్యోగులు, 1,500 మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ వైద్య సిబ్బంది పనిచేస్తున్నారు. అందులో దాదాపు 4 వేల మంది వరకు డాక్టర్లు ఉన్నారు. ఆ ఆసుపత్రుల్లో ప్రసూతి నుంచి మొదలు పెద్దస్థాయి శస్త్రచికిత్సలు, రోడ్డు ప్రమాద కేసులు, సిటీ స్కానింగ్, ఎక్స్‌రే, ఆల్ట్రాసౌండ్, ల్యాబ్ టెస్టింగ్ జరుగుతుంటాయి. ఎయిడ్స్, టీబీ, స్వైన్‌ఫ్లూ వంటి రోగులకూ వీరు సేవలందిస్తున్నారు. జిల్లాల్లో ఇంతటి కీలకమైన ఆసుపత్రుల్లోని వైద్య సిబ్బందిపై సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. 1996లో వైద్య విధాన పరిషత్‌ను అటానమస్ సంస్థగా దీన్ని నెలకొల్పారు. అయితే అది తన కాళ్ల మీద నిలబడే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వమే వైద్య విధాన పరిషత్‌ను తన స్వాధీనంలోకి తీసుకుంది.
అయితే ఇందులో పనిచేసే ఉద్యోగులను 010 పద్దు కింద ట్రెజరీ పరిధిలోకి తీసుకురాకపోవడంతో వీరి వేతనాల కోసం ప్రభుత్వం రెండు మూడు నెలలకోసారి విడుదల చేస్తుంది. దీంతో వారికి సకాలంలో వేతనాలు రావడంలేదు. ట్రెజరీ పరిధిలో లేరన్న కారణం... ఇతరత్రా సాంకేతిక కారణాలు చూపించి ప్రభుత్వ ఉద్యోగులైనా వీరికి ఆరోగ్యకార్డులు ఇవ్వలేదు. ఆందోళనలో కాంట్రాక్టు ఉద్యోగులు... మరోవైపు వైద్య విధాన పరిషత్‌లో పనిచేస్తున్న 158 మంది కాంట్రాక్టు ఉద్యోగులు కలెక్టర్ల అధ్యక్షతన డీఎస్సీ, రోస్టర్ విధానం అనుసరించి రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే నియమితులయ్యారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ పొందుతున్నారు.
కానీ వీరు క్రమబద్దీకరణకు నోచుకోవడంలేదు. దీంతో ఏడేళ్లుగా పనిచేస్తున్న ఈ ఉద్యోగులు నిరాశలో ఉన్నారు. ఇక ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్‌ఐలను ఏజెన్సీలు వారి ఖాతాల్లో వేయడంలేదని ఉద్యోగులు చెబుతున్నారు. సర్కారుకు ఎన్నిసార్లు చెప్పినా: జూపల్లి రాజేందర్, వైద్య ఉద్యోగుల నేత వైద్య విధాన పరిషత్‌లో పనిచేసే ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఆరోగ్య కార్డులు ఇవ్వాలని... వీరిని ట్రెజరీ పరిధిలోకి తీసుకురావాలని ఎన్నిసార్లు కోరినా సర్కారు పట్టించుకోవడంలేదు.