పైసల్లేవ్!
♦ ఇన్‌పుట్ సబ్సిడీ విడుదలపై మీనమేషాలు
♦ కరువు జిల్లాగా ప్రకటించినప్పటికీ
♦ సాయంపై దాటవేత తక్షణ సాయం చేస్తే
♦ ఖరీఫ్ అవసరాలకు ఉండవని భావన
♦ మే, జూన్‌లోనే రాయితీ నిధులొచ్చే అవకాశం
మునుపెన్నడూలేని విధంగా జిల్లాలో కరువు కరాళ నృత్యం చేస్తోంది. పంటల్లేక అన్నదాతలు వలసబాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్ల క్రితం కేంద్ర కరువు బృందం పర్యటించి జిల్లాలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది. గత ఖరీఫ్‌లో జరిగిన భారీ నష్టానికి సాయం చేస్తామంటూ భరోసా ఇచ్చింది. అతిత్వరలోనే తమ ఖాతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీ పడుతుందని భావించిన రైతాంగానికి తీవ్ర నిరాశే ఎదురైంది. వీటిని ఇప్పట్లో విడుదలచేసే అవకాశం లేదని, మే, జూన్ వరకు ఆగాల్సిఉంటుందనే ప్రభుత్వ సంకేతాలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అడుగంటిన జలాలు.. పశుగ్రాసం కొరత, కబేలాకు తరలుతున్న పశువులను చూసి బావురుమంటున్న అన్నదాతలకు అపన్నహస్తం అందించాల్సిన ప్రభుత్వం.. నిర్లిప్త వైఖరిని అవలంబిస్తోంది. ఇప్పటికిప్పుడు పంట రాయితీ (ఇన్‌పుట్ సబ్సిడీ)ని అందజేస్తే ఖరీఫ్ సీజన్‌లో అవి కరిగిపోతాయని భా వించి ఉద్దేశపూర్వకంగా నిధుల విడుదలలో జా ప్యం చేస్తున్నదని తెలుస్తోంది. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి కూడా సంకేతాలు పంపింది. కరువు నిధుల కోసం ఒత్తిడి చేయవద్దని మరికొన్నాళ్లు వేచిచూడాల్సిందేనని తేల్చిచెప్పింది. దీంతో కరువుకోరల్లో చిక్కుకున్న రైతాంగానికి క ష్టాలు తప్పేలా లేవు.
కరువు దరువు
గత ఖరీఫ్‌లో సాధారణ వర్షపాతం కూడా న మోదు కాకపోవడంతో దారుణంగా పంటలు దె బ్బతిన్నాయి. జిల్లావ్యాప్తంగా 1,00,931.72 హెక్టార్ల విస్తీర్ణంలోని పంటలు తుడుచుకు పెట్టుకుపోయిన ట్లు జిల్లా వ్యవసాయశాఖ లెక్క తేల్చింది. ఈ మేరకు 2,03,275 మంది రైతులు నష్టపోయారని, పంటనష్టం రూ.73.33 కోట్ల మే ర జరిగిందని అంచనా వేసింది. ఇదే నివేదికను మూడు నెలల క్రితం జిల్లాలో పర్యటించిన కేంద్ర కరువు బృందానికి జిల్లాయంత్రాంగం సమర్పిం చింది.
ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, పరిగి, చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు సాగించిన ప్రతినిధి బృందం కరువు పరిస్థితులను చూసి చలించిపోయింది. వేగంగా నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని,తక్షణ సాయం అందేలా చూస్తామని భరోసా ఇచ్చింది. దీంతో ఊరటచెందిన రైతులు నేడో, రేపో ఇన్‌పుట్ సబ్సిడీ డబ్బులు తమ ఖాతాల్లో పడతాయని ఆశించారు. అయితే బృందం కేంద్రానికి నివేదిక సమర్పించడంలో జాప్యం ప్రదర్శించింది.
కరువు పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన కేంద్ర సర్కారు కూడా నిధుల విడుదలకు సానుకూలంగానే స్పందించిం ది. అయితే, ఈ నిధులను ఇప్పటికిప్పుడు ఇస్తే ఖర్చయిపోతాయని, ఖరీఫ్ అవసరాలకు వాడుకునేలా మే, జూన్‌లో ఇస్తే ఎలా ఉంటుందనే దిశగా ఆలోచన చేస్తోంది. ఈ సంకేతాలను అధికారులకు పంపింది. దీంతో ఇన్‌పుట్ సబ్సిడీ కోసం మరికొన్నాళ్లు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.