బాబు పాలనలో సొంతగూడు కరువు
-
గడపగడపకూ వైఎస్సార్‌లో పేదల గగ్గోలు
-
కార్యక్రమానికి అనూహ్య స్పందన
కాకినాడ :
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇదిగో ఇళ్లు, అదిగో రుణం అంటూ రెండేళ్లు గడిపేశారు. కాని పేదలకు ఒక్క పూరిగుడిసైనా కట్టివ్వలేదు. పేద లు సొంద గూడులేక ఇబ్బంది పడుతున్నారు. వారికి పూర్తిగా అన్యాయం జరుగుతోందంటూ కాకినాడ రూరల్ 49వ డివిజన్‌లో జరిగిన గడపగడపకూ వైఎస్సార్‌లో ఓనుం ప్రభాకరరావు ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో గురువారం జరిగిన గడపగడపకూ వైఎస్సార్‌లో ప్రభుత్వ మోసపూరిత విధానాలపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
జన్మభూమి కమిటీల ఆగడాలు పెచ్చురిల్లాయి. అర్హులందరి పింఛన్లను తొలగిస్తున్నారు. అధికారులే ఏమీ చేయలేకపోతున్నారని, టీడీపీకి బుద్ధి చెప్పే కాలం దగ్గరపడుతుందని అదే ప్రాంతానికి చెందిన పి.రమణ ఆవేదన వెళ్లబుచ్చాడు.
ఇళ్లు ఎప్పుడొస్తాయో...
టీడీపీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని కొత్తపల్లి మండలం గోర్స గ్రామంలో పలువురు తమ ఆవేదన వ్యక్తం చేశారు. గోకవరం మండలం ఇటికాయలపల్లిలో ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదని తలారి సంధ్య తెలిపారు. ముమ్మిడివరం మండలం అయినాపురం పంచాయతీ పరిధిలో ఇళ్లు మంజూరు చేయలేదంటూ బొర్రా నాగరత్నం ఆవేదన వ్యక్తం చేసింది.
మురికి కూపంలో మగ్గుతున్నాం
రౌతులపూడి మండలంలోని పారుపాక ఎస్సీపేటలో డ్రెయినేజీ సదుపాయాలు లేక మురికికూపంలో మగ్గుతున్నామని పాలెడ్డి నాగమణి పర్వత వద్ద వాపోయింది. కాకినాడ జగన్నాథపురం మెయిన్‌రోడ్డు, విష్ణాలయం వీధులలో ఆశీల పేరుతో వివిధ శాఖలకు చెందిన సిబ్బంది తమను ఇబ్బంది పెడుతున్నారంటూ నాయకుల వద్ద రవి అనే చిరువ్యాపారి ఆవేదన వ్యక్తం చేశాడు.
రోడ్ల సదుపాయం లేక..
రాజమహేంద్రవరం రూరల్ కాతేరు మిలటరీ కాలనీలో రోడ్లు గోతులమయంగా మారినా పట్టిం చుకోవడంలేదని ఆప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు తెలిపారు. ఆలమూరు మండలంలోని మూలస్థాన అగ్రహారంలో స్థానిక సమస్యలను పార్టీ నేతల దృష్టికి తీసుకొచ్చారు. అమలాపురం రూరల్ మండలం సాకుర్రు ప్రాంతంలో పొలమూరుబాలకృష్ణనగర్, కాపులపాలెం, క్రాపవీధి తదితర ప్రాంతాల్లో పంటపొలాలకు వెళ్లేందుకు రోడ్లు లేక ఇబ్బంది పడుతున్నామని మాజీ సొసైటీ ప్రెసిడెంట్ గుత్తుల జనార్దనరావు ఆవేదన వ్యక్తం చేశాడు. మంచినీటి సమస్యతో సతమతమవుతున్నామని కాపులపాలెంనకు చెందిన బాలకృష్ణ తెలిపాడు.