పట్టాదారులకు నోటీసులు
గోపవరం :
బినామీ పేర్లతో పట్టాలు పొంది ప్రైవేటు సంస్థకు లీజుకు ఇచ్చిన సంబంధిత వ్యక్తులకు ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. మండలంలోని శ్రీనివాసపురం గ్రామానికి సమీపంలో 1988 సర్వే నెంబరులో స్థానిక టీడీపీ నాయకుడు 1996లో బినామీ పేర్లతో 13 ఎకరాలు పట్టాలు పొందాడు. అప్పటి నుంచి ఆ భూములను వ్యవసాయానికి ఉపయోగించలేదు. గత నాలుగైదు సంవత్సరాలుగా ప్రైవేటు విద్యుత్తు సంస్థలకు లీజుకు ఇస్తూ లక్షల రూపాయలు లబ్ధిపొందుతూ వస్తున్నారు. ప్రభుత్వ భూమిని లీజుకు ఇవ్వడంపై సీపీఐ వరుస ఆందోళనకు దిగడంతో రెవెన్యూ అధికారుల్లో కదలిక వచ్చింది. బినామీ పేర్లతో కేటాయించిన భూమిని పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి నివేదికలు తయారు చేశారు. ఈ మేరకు రాజంపేట ఆర్డీఓ ప్రభాకర్‌పిళ్లైకు కూడా నివేదిక కాపీలను పంపించారు. పట్టాలు పొందిన 9 మందికి నోటీసులు అందచేశారు. నోటీసులు అందుకున్న రెండు వారాల్లోపు సంబంధిత అధికారులకు వివరణ ఇవ్వాల్సి ఉంది. తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. కాగా ప్రభుత్వ భూమిని లీజుకు తీసుకున్న కెఈసీ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (పవర్‌గ్రిడ్) సంస్థకు కూడా నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ మేరకు నోటీసు అందుకున్న పవర్‌గ్రిడ్ సీనియర్ మేనేజర్ రాజీవ్‌గాంధీని సాక్షి వివరణ కోరగా గతంలో ఓ విద్యుత్తు సంస్థ లీజుకు తీసుకోవడంతో తిరిగి తాము ఈ భూమిని లీజుకు తీసుకోవడం జరిగిందన్నారు. ఒరిజినల్ పట్టా భూములా లేక డీకేటీ భూములా అనేది పరిశీలించలేదన్నారు.