ఇక.. ఆన్‌లైన్‌లో అభివృద్ధి పనులు
గుంటూరు (నెహ్రూనగర్): నగరపాలక సంస్థలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఇకపై ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నట్లు నగర కమిషనర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. కౌన్సిల్ హాలులో గురువారం ఈ అంశానికి సంబంధించి లీడ్ విన్నర్ సంస్థ పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ జరుగుతున్న అభివృద్ధి పనులను కంప్యూటర్ నుంచే తనిఖీలు నిర్వహించే విధంగా తమ సంస్థ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కమిషనర్ నాగలక్ష్మి మాట్లాడుతూ అభివృద్ధి పనులు ఆన్‌లైన్ అయితే త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుంటుందని చెప్పారు. ఈ ఆన్‌లైన్ విధానాన్ని త్వరలో ముందుగా గుంటూరు నగరపాలక సంస్థలోనే ప్రవేశపెట్టనున్నారని తెలిపారు.