సామాజిక సేవలో ఎన్‌ఎస్‌ఎస్
సామాజిక సేవలో ఎన్‌ఎస్‌ఎస్
Published Fri, Sep 23 2016 10:02 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM
దామరచర్ల
సామాజిక సేవా కార్యక్రమాల్లో విద్యార్థులు, ఉపా«ధ్యాయులు, మేథావులు పాల్గొనేలా చేసి వారిలో దేశ భక్తిని, సేవాతత్పరతను పెంపొందించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిందే జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్). స్వాతంత్య్ర సంగ్రామంలో సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలు విద్యార్థుల పాత్రతో విజయవంతం అయ్యాయి. మహాత్ముని శత జయంతి సందర్భంగా1969 సెప్టెంబర్ 24న తొలిప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సూచనల మేరకు ఎన్‌ఎస్‌ఎస్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం దేశంలోని 47 యూనివర్సిటీల్లో ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో సుమారు 2లక్షల మంది ఎన్.ఎస్.ఎస్ వలంటీర్లు సేవలు అందిస్తున్నారు.
పథకం ఉద్దేశం..
సమాజ సేవద్వారా విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి సాధించాలన్నదే లక్ష్యం. స్వేచ్ఛ, సమానత్వం, జాతీయ సమైక్యత, లౌకిక సామ్యవాద, గౌరవ భావం ఏర్పర్చడం. అసమానతలు, క్రూరత్వాన్ని నిరోధించడం. దేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదను కాపాడడం. సమాజంపై అవగహన ఏర్పర్చుకోవడం. సమస్యలు కనుగొనడం, వాటి నివారణకు కృషి చేయడం. సామాజిక సృహ, సమాజ సేవ, పౌరబాధ్యతలు పెంచడం. పాఠశాలకు సమాజానికి సంబంధాన్ని పెంపొందించడం. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంచడం.
ఎన్‌ఎస్‌ఎస్ విధులివే..
పచ్చదనం పరిశుభ్రత, ఆరోగ్య కార్యక్రమాలు, వ్యక్తి నిర్మాణ కార్యక్రమాలు, చట్టం, న్యాయం, వలంటీర్లకు శిక్షణ, భావ వ్యక్తీకరణ కార్యక్రమాలు. పల్స్‌పోలియో, వివిధ ప్రత్యేక దినోత్సవాలు, వారోత్సవాలు నిర్వహించడం.
ప్రత్యేక శిబిరాలు
ప్రతి ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. దీని కోసం ప్రభుత్వం ప్రత్యేక ని«ధిని కేటాయించింది. గ్రామాల్లోని మురికివాడల్లో విద్యార్థులు ఏటా వారం రోజులు ఉండి శ్రమదానం చేయాలి. వీటి ద్వారా పారిశుద్ధ్యం, రహదారుల అభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం, మొక్కలు నాటడం, నీటి వినియోగంపై గ్రామస్తులకు వివరించడం, బాణామతి, చేతబడులు వంటి మూఢ నమ్మకాలపై కళాప్రదర్శనల ద్వారా ప్రజలను చైతన్య వంతులను చేయాలి. పౌష్టికాహారం ఆవశ్యకతను ప్రజలకు వివరించాలి.ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలి. శిబిరాల్లో 240 గంటలు పనిచేసిన విద్యార్థులకు ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తున్నారు.
విద్యార్థులు ముందుండాలి
– డాక్టర్ రాజేశ్వర్‌నాయక్ (ప్రోగ్రామ్ అధికారి)
సమాజ సేవలో విద్యార్థులు ముందుండాలి. సేవల ద్వారా విద్యార్థులు సర్వతో ముఖాభివృద్ధి చెందుతారు. జాతీయ సేవకు ఈశిబిరాలు దోహదం చేస్తాయి. సేవాతత్పరత కలిగిన విద్యార్థులే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారు. విద్యార్థులకు ఎన్‌ఎస్‌ఎస్ తప్పనిసరి.
చైతన్యవంతులను చేయొచ్చు
– కె.ప్రశాంత్, వ్యవసాయ విద్యార్థి
ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాల çసందర్భంగా సామాజిక సమస్యలపై ప్రజలను చైతన్యవంతులను చేసే వీలు కలుగుతుంది. సామాజిక పరిస్థితులను ఆకలింపు చేసుకోవడం వలన మనలో భావ వ్యక్తీకరణకు దోహదపడుతుంది. సమాజంపై అవగాహన పెరుగుతుంది.
Advertisement
Advertisement