అంకెల గారడీ.. వృద్ధి పేరిట బురిడీ | number magic.. false data by the name of development | Sakshi
Sakshi News home page

అంకెల గారడీ.. వృద్ధి పేరిట బురిడీ

Published Fri, Oct 7 2016 1:48 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

number magic.. false data  by the name of development

సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో వ్యవసాయ రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రస్తుత సీజన్‌లో నీరందక నారుమడులు ఎండిపోయాయి. నాట్లు సైతం దెబ్బతిన్నాయి. నరసాపురం మండలం చిట్టవరంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరువాక పేరిట నాట్లు వేసిన పొలంలోనూ వరి దుబ్బులు ఎండిపోయాయి. నీళ్లందక పలుచోట్ల పంట విరామం ప్రకటించారు. గడచిన సీజన్లలోనూ ప్రకృతి వైపరీత్యాలు, సాగునీటి కొరత, వాతావరణ సమస్యల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. వాస్తవ పరిస్థితులు ఇలావుంటే.. జిల్లాలో వ్యవసాయ రంగం పురోగమిస్తోందని.. గడచిన రెండేళ్లలో 15 శాతం వృద్ధి సాధించామని సర్కారు కోతలు కోస్తోంది.
 
వ్యవసాయ రంగంలో మన జిల్లా 15 శాతం వృద్ధిరేటు సాధించిందని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం కట్టిన లెక్కలు వాస్తవం కాదన్న వాదన రైతు సంఘాల నుంచి వినిపిస్తోంది. వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోగా.. గడచిన రెండేళ్లలో 15 శాతం వృద్ది సాధించామని చెప్పడాన్ని నిపుణులు కొట్టిపారేస్తున్నారు. రెండేళ్లలో 15 శాతం వృద్ధి సాధ్యం కాదని, ప్రభుత్వ మెప్పు కోసం అధికారులు తప్పుడు లెక్కలు ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు చెబుతున్న దాని ప్రకారం గడచిన రెండేళ్ల కాలంలో వరి దిగుబడి రెండిం తలు పెరగాలి. అలాంటి పరిస్థితి జిల్లాలో ఉందా అంటే ఎక్కడా లేదనే సమాధానం వస్తోంది. 
 
అంతా బూటకం
టీడీపీ అధికారంలోకి రాక ముందు వ్యవసాయ అధికారులు ఇచ్చిన నివేదికలు, ఇప్పుడు ఇస్తున్న నివేదికలను పరిశీలిస్తే 15 శాతం వృద్ధి సాధించామన్న ప్రకటన వట్టి బూటకమని చెప్పక తప్పదు. గత రెండేళ్లుగా ఖరీఫ్‌ పంట చేతికి వచ్చే సమయానికి భారీ వర్షాలు, తెగుళ్ల కారణంగా రైతులు ఇబ్బంది పడ్డారు. లక్షల ఎకరాల్లో పంట దెబ్బతినడంతోపాటు, సరైన దిగుబడి రాక నష్టపోయారు. వాస్తవ పరిస్థితి ఇలావుంటే.. అధికారులు మాత్రం లెక్కలతో మాయ చేస్తున్నారు. జిల్లాలో ప్రధానమైన వరి దిగుబడులను పరిశీలిస్తే 2012 ఖరీఫ్‌లో జిల్లాలో 6.70 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఆ ఏడాది అధికారులు అంచనా వేసిన దిగుబడి లక్ష్యం హెక్టార్‌కు 3,117 కిలోలు. అంటే హెక్టార్‌కు 41.56 బస్తాలు (బస్తా 75 కిలోలు). ఈ లెక్కన ఎకరాకు సగటు దిగుబడి 16.62 బస్తాలు. అదే ఏడాది రబీలో 4.20 లక్షల హెక్టార్లలో వరి సాగు చేయగా, దిగుబడి లక్ష్యం హెక్టారుకు 6,734 కిలోలు. అంటే హెక్టారుకు 89.7 బస్తాల చొప్పున ఎకరానికి 35.91 బస్తాలు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఏడాది మొత్తంగా ఖరీఫ్, రబీ కలిసి 52.53 బస్తాల దిగుబడి ఉండేది. అప్పట్లో వ్యవసాయ వృద్ధి రేటును 8 శాతంగా చెప్పేవారు. 2014లో 5.77 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యింది. అదే ఏడాది రబీలో 4.25 లక్షల ఎకరాల్లో వరి వేశారు. 2015–16లో సాగు విస్తీర్ణం తగ్గింది. ఈ ఏడాది 5.90 లక్షల ఎకరాల్లోనే పంట సాగు చేస్తున్నారు. శివారు ప్రాంతాలకు నీరందక పంటలు ఎండిపోవడం, తర్వాత అకాల వర్షాలకు చాలా ప్రాంతాల్లో పంట దెబ్బతినడం వంటి పరిస్థితులు తలెత్తాయి. కృష్ణాడెల్టా ఆయకట్టులో సగానికి పైగా విస్తీర్ణంలో నాట్లు వేయలేదు. అయినా 13 శాతం వృద్ధి సాధిస్తామని లెక్కల్లో పేర్కొన్నారు. గత రెండేళ్లలో సాగు విస్తీర్ణం, ఉత్పాదన ప్రకారం లెక్కించినా ఖరీఫ్, రబీలో ఎకరానికి 100 బస్తాల దిగుబడి వచ్చి ఉండాలి. ఖరీఫ్‌లో 50 బస్తాలు, రబీలో 50 బస్తాల దిగుబడి రాలేదనే విషయం సామాన్యుడికి సైతం తెలిసిన విషయమైనా.. అధికారులు మాత్రం అందుకు భిన్నంగా భారీ వృద్ధి రేటు సాధించినట్టు లెక్కలు కట్టి ప్రభుత్వానికి సమర్పించారు. 
 
సగటు దిగుబడి 20 బస్తాలు దాటలేదు
పంట పొలాలను చేపల చెరువులుగా మార్చేం దుకు అనుమతులు ఇస్తున్న సందర్భంలో సదరు భూముల్లో సగటున 20 బస్తాల దిగుబడి అయినా రావడం లేదని వ్యవసాయ అధికారులు నివేదిక ఇస్తున్నారు. తక్కువ దిగుబడి వస్తున్నందున్న చేపల చెరువుల తవ్వకానికి అభ్యంతరం లేదని పేర్కొంటున్నారు. మరి ఇలాంటప్పుడు దిగుబడి అమాంతం ఎలా పెరిగిపోయింది, వృద్ధి రేటు 15 శాతం ఎలా సాధ్యమయ్యిందనే దానికి వారివద్ద సమాధానం లేదు. వ్యవసాయ వృద్ధి రేటును  సాగు విస్తీర్ణం, దిగుబడి, ఉత్పాదన ఆధారంగా లెక్కిస్తారు. ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు విస్తీర్ణం ఎంత, సరాసరి దిగుబడి ఎంత వచ్చిందనే లెక్కల ఆధారంగా వ్యవసాయ వృద్ధి రేటును అంచనా వేస్తారు. మెట్ట ప్రాంతంలో వరి దిగుబడులు తక్కువగాను, డెల్టాలో కొంచెం ఎక్కువగాను ఉంటాయి. రెండుచోట్లా దిగుబడిని సరాసరి చేసి సగటు వృద్ధి రేటు నమోదు చేస్తారు. అదే తరుణంలో సాగు ఆరంభానికి ముందు ఈ ఏడాది ఎంతమేర దిగుబడి సాధించాలనే లక్ష్యాలను సైతం వ్యవసాయ శాఖ నిర్దేశించుకుంటుంది. గడచిన రెండున్నరేళ్ల కాలంలో జిల్లాలో వ్యవసాయ రంగం ఒడిదుడుకులతో సాగింది. 2014 ఖరీఫ్‌లో వర్షాలకు తోడు, దోమపోటు కారణంగా పంట దిగుబడి రాక రైతులు విలవిల్లాడిపోయారు. 2015 ఖరీఫ్‌లో డిసెంబర్‌ రెండో వారంలో విరుచుకుపడిన భారీ వర్షాలకు జిల్లాలో 1.33 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. రూ.80 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు లెక్కగట్టి ప్రభుత్వానికి నివేదించారు. ఆ ఏడాది రబీలో కొన్నిచోట్ల దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ చాలాచోట్ల సాధారణ దిగుబడులే వచ్చాయి. వరి విషయం ఇలా ఉంటే.. విత్తన కంపెనీల మోసంతో మొక్కజొన్న దిగుబడి తగ్గింది. పొగాకు  కూడా ధర లేక దిగుబడి తగ్గి రైతులు ఇబ్బంది పడ్డారు. చెరకు రైతుల పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదనేది తెలిసిన విషయమే. గడచిన రెండేళ్లుగా మామిడి దిగుబడి పడిపోయింది. వాస్తవ పరిస్థితులు ఇలావుంటే అధికారులు మాత్రం వ్యవసాయ రంగంలో 15 శాతం వృద్ధి సాధించామని చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement