
నివేదికలతో సరి !
- అతీగతీలేని రూ.23.80 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ
- 2015 నవంబర్‌లో తుపాను దెబ్బకు కుళ్లిన పంట
- పట్టించుకోని అధికారులు
అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్ – 2015కు సంబంధించి రూ.23. 80 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ జిల్లా రైతులకు అందాల్సి ఉంది. 18 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ డబ్బులు మాత్రం రైతులకు అందలేదు. కనీసం ఇస్తామన్న భరోసాను కూడా అధికారులు ఇవ్వలేకపోతున్నారు. పంట కోత సమయంలో వరుసగా తుపాన్లు రావడంతో చాలా చోట్ల తొలగించిన పంట పొలాల్లోనే ఉండిపోయింది. 15 రోజుల వ్యవధిలో మూడు తుపాన్లు రావడంతో ఆ పంట బూజుపట్టి కుళ్లిపోయింది. చెనక్కాయలు రంగుమారి మొలకలు రాగా, పశుగ్రాసానికి కూడా పనికిరానంతగా చెడిపోయింది. ఈ క్రమంలో అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 2015 నవంబర్, డిసెంబర్ నెలల్లో పంట నష్టం అంచనా వేశారు.
అప్పట్లో ప్రాథమిక అంచనా ప్రకారం 45 మండలాల పరిధిలో 30 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంట దెబ్బతిన్నట్లు నివేదిక తయారు చేశారు. అయితే పంట నష్టం అంచనా వేసిన బృందాలు చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు 33 మండలాల పరిధిలో 16,311 హెక్టార్లలో పంట దెబ్బతినడంతో రూ.23.80 కోట్ల నష్టం వాటిల్లినట్లు తేల్చారు. అదే నివేదికను ప్రభుత్వానికి, కమిషనరేట్‌కు పంపారు. కానీ... ఇప్పటివరకు దాని గురించి పట్టించకున్న నాథుడే కరువయ్యారు. రూ.23.80 కోట్ల ఇన్‌పుట్ నివేదిక ఒకటుంది... అది విడుదలయ్యేలా చూద్దామన్న ఆలోచన కూడా ఎవరికీ రాకాపోవడం విశేషం. 2015లో పంట పండినట్లు జిల్లా నుంచి నివేదిక పంపడంతో వేరుశనగ రైతులకు ఇన్‌పుట్‌సబ్సిడీ మంజూరుకాని పరిస్థితి నెలకొంది. కనీసం తుపాను ధాటికి దెబ్బతిన్నట్లుగా పంపిన రూ.23.80 కోట్లు అయినా మంజూరు చేస్తే 15 వేల మంది రైతులకు లబ్ధి జరుగుతుంది.
అతలాకుతలం చేసిన తుపాను
వాస్తవానికి 2015 నవంబర్‌లో వేరుశనగ పంట తొలగించే సమయంలో సంభవించిన తుపానుతో వేరుశనగతో పాటు పత్తి, పెసర తదితర పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది. నెల రోజుల పాటు విరామం లేకుండా వర్షాలు కురవడంతో కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, పెనుకొండ, హిందూపురం డివిజన్ల పరిధిలో మెజార్టీ మండలాలు తడిసిముద్దయ్యాయి. దీంతో తొలగించిన వేరుశనగ పంట పొలాల్లోనే కుళ్లిపోయింది. పంట తొలగించని ప్రాంతాల్లో కూడా మొలకలు రావడంతో రైతులకు భారీగానే నష్టం జరిగింది. మిగతా పంటలను పూర్తిగా పక్కనపెట్టి కంటితుడుపుగా కేవలం వేరుశనగ పంటకు మాత్రమే ఇన్‌పుట్ ప్రతిపాదనలు పంపారు. దెబ్బతిన్న పంట పొలాలను అప్పటి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శించి కుళ్లిన పంటను చూసి చలించిపోయారు. తక్షణం ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటామని భరోసా ఇచ్చి 18 నెలలైనా పైసా కూడా విదల్చకపోవడం గమనార్హం.