![అధికారుల తప్పిదం.. అందని పురస్కారం](/styles/webp/s3/article_images/2017/09/4/51478275914_625x300.jpg.webp?itok=073TrIPF)
అధికారుల తప్పిదం.. అందని పురస్కారం
హిందూపురం టౌన్ : దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వని చందంగా పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సాధించిన పురస్కారం అధికారుల తప్పిదంతో అందకుండా పోయింది. వివరాలు.. పట్టణంలోని లక్ష్మిపురం ప్రాంతానికి చెందిన విజయసాయి, లీలమ్మ దంపతుల కుమార్తె నామకల్లు ప్రవల్లిక అనంతపురంలోని ఎస్కేయూలో పీజీ విభాగంలో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిభ పురస్కారం 2016కు ఎంపికైంది.
గత నెల 15న విజయవాడలో సీఎం చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం, ప్రశంసాపత్రం, హైదరాబాద్ సిండికేట్ బ్యాంకు మీద రూ.20 వేల డీడీ అందించారు. అయితే డీడీపై నామకల్లు ప్రవల్లిక బదులు ''హారిక నామకల్లు ప్రవల్లిక'' అనే పేరు రాసి ఇచ్చారు. డీడీ తీసుకుని హిందూపురంలోని సిండికేట్ బ్యాంకుకు వెళ్లగా చెల్లదని వెనక్కి పంపినట్టు బాధితురాలు వాపోయింది. హైదరాబాద్ వెళ్లి డీడీ మార్పించుకుని రావాలని సూచించారు.