
పింఛన్ కోసం మంచంపై తెచ్చారు
ప్రకాశం జిల్లా: వృద్ధాప్యంలో ఆసరాగా ఉన్న పింఛన్‌ను రేషన్ కార్డు లేదన్న సాకుతో రద్దు చేశారు. కార్డు కోసం ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా ఫలితం లేకపోవడంతో బుధవారం జరిగిన జన్మభూమి గ్రామసభకు ఓ వృద్ధుడిని మంచం మీద తీసుకొచ్చిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
కొనకనమిట్ల మండలం పెదారికట్ల ఎస్సీ కాలనీకి చెందిన అక్కిదాసరి ప్రభుదాసు(60)కు భార్యాబిడ్డలు ఎవరూ లేరు. దూరపు బంధువుల దగ్గర ఆశ్రయం పొందుతున్నాడు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో నెలకు రూ.200 పింఛన్ తీసుకున్నాడు. ప్రభుత్వం మారడంతో రేషన్‌కార్డు లేదన్న సాకుతో అతని పింఛన్ రద్దు చేశారు. అప్పటి నుంచి కార్డు కోసం ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్న అధికారులు కనికరించలేదు. బుధవారం జన్మభూమి గ్రామసభ జరుగుతుందని తెలుసుకున్న ప్రభుదాసు బంధువులు అతడిని మంచం మీదనే గ్రామసభకు తీసుకొచ్చారు. అతని పరిస్థితిని అధికారులకు వివరించారు. ఆధార్‌కార్డు, వికలాంగ సర్టిఫికెట్ ఉందని పింఛన్ ఇవ్వాలని చేతులు జోడించి ప్రభుదాసు అధికారులను వేడుకున్నాడు. అతని పరిస్థితి తెలుసుకున్న తహశీల్దార్ జ్వాలా నరసింహం రేషన్‌కార్డు మంజూరు చేసి పింఛన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుదాసుని మంచంపై గ్రామసభకు తీసుకురావడానికి కారణమైన అధికారుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.