అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
-
పలువురు కిడ్నాప్ చేసి, చిత్రహింసలు పెట్టారంటూ సూసైడ్ నోట్
-
ప్రేమ వ్యవహారం విఫలమై ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే సందేహాలు
భూపాలపల్లి : సింగరేణియన్ సన్స్ అసోసియేషన్(ఎస్‌ఎస్‌ఏ)లో పనిచేసే ఓ కార్యకర్త అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ సంఘటన భూపాలపల్లి మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ సీహెచ్ రఘునందన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కార్ల్ మార్క్స్ కాలనీలో నివాసం ఉంటూ కేటీకే 5వ ఇంక్లైన్‌లో విధులు నిర్వర్తించే ఏకారి శంకర్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సత్యనారాయణ(23) ఉన్నారు. సత్యనారాయణ గతేడాది పీజీ పూర్తి చేశాడు. వారం క్రితం పట్టణంలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ట్యూటర్‌గా చేరాడు. గత శుక్రవారం రాత్రి 7 గంటలకు కళాశాలకు వెళ్తున్నట్లుగా ఇంట్లో చెప్పి, బ్యాగ్‌తో బయటకు వెళ్లాడు. శనివారం ఉదయం వరకూ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతడి సెల్‌ఫోన్‌కు కాల్ చేశారు. అయినా లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో గాలించారు. ఈ క్రమంలో మండలంలోని కమలాపూర్ క్రాస్ రోడ్ సమీపంలో పూర్తిగా కాలిపోయి ఉన్న ఓ మృతదేహం ఉన్నట్లుగా శంకర్ కుటుంబ సభ్యులకు సోమవారం ఉదయం సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా అది సత్యనారాయణ మృతదేహంగా గుర్తించారు. మృతుడి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రఘునందన్‌రావు తెలిపారు.
బ్యాగ్‌లో సూసైడ్ నోట్..
సత్యనారాయణ మృతదేహం సమీపంలో ఇంటి నుంచి తెచ్చుకున్న బ్యాగు పడి ఉంది. అందులోని ఒక నోట్‌బుక్‌లో మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఉంది. తనను పలువురు వాహనాలు మార్చుతూ, ఎక్కడెక్కడో తిప్పుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని అందులో రాశాడు. లేఖలోని వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఓ అమ్మాయితో పరిచయం..
సింగరేణియన్ సన్స్ అసోసియేషన్ కార్యక్రమాల్లో అంతంత మాత్రంగానే పాల్గొనే సత్యనారాయణను ఎవరూ బెదిరించే అవకాశాలు లేవని తెలుస్తోంది. సత్యనారాయణకు ఓ అమ్మాయితో పరిచయం ఉన్నట్లు తెలిసింది. గత శుక్రవారం ఉదయం ఇంట్లోని డబ్బులు తీసుకొని ఆమె దగ్గరకు వెళ్లినట్లు తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు సత్యనారాయణను మందలించినట్లు సమాచారం. ప్రేమ వ్యవహారంలో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఇతర కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతోంది.