♦ విద్యార్థుల జీవితాలతో ఓయూ అధికారుల చెలగాటం
♦ పకడ్బందీగా నిర్వహించాల్సిన పరీక్షలపై అశ్రద్ధ
♦ పాత సిలబస్‌తో పేపర్ ఇవ్వడంతో వందల మంది ఫెయిల్
♦ ప్రశ్నపత్రం మారడంతో మార్కులు కలిపిన అధికారులు
♦ అయినా తీవ్రంగా నష్టపోయిన ఇంజనీరింగ్ ఫస్టియర్ విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. పకడ్బందీగా నిర్వహించాల్సిన పరీక్షలపై ఎనలేని అశ్రద్ధ కనబరుస్తున్నారు. వీరి నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. పాత సిలబస్‌తో పరీక్ష పేపర్ ఇవ్వడంతో వందల మంది ఇంజనీరింగ్ ఫస్టియర్ విద్యార్థులు ఫెయిలయ్యారు. అధికారులు చడీచ ప్పుడు కాకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టినా అప్పటికే నష్టం జరిగిపోయింది. మార్కులు కలిపినా గుడ్డిలో మెల్ల చందంగా కొంతమంది పాసయ్యారే తప్ప మెరుగైన ఫలితాలు సాధించలేకపోయారు. ఇంకొందరు అనుత్తీర్ణులుగానే మిగిలిపోయారు.
ఏం జరిగింది..
ఓయూ పరిధిలో 2014-15 బ్యాచ్‌కి చెందిన ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు ఈ ఏడాది మేలో నిర్వహించారు. ఇంగ్లిష్ సబ్జెక్ట్‌కు సంబంధించి మారిన సిలబస్ ప్రకారం ప్రశ్నపత్రం ఇవ్వాల్సి ఉండగా.. పాత సిలబస్‌తో ప్రశ్నపత్రం ఇవ్వడంతో విద్యార్థులు ఖంగుతిన్నారు. దీంతో చాలామంది విద్యార్థులు ఇంగ్లిష్‌లో ఫెయిలవ్వడంతో ఉత్తీర్ణత 50 శాతం కూడా దాటలేదు. ప్రశ్నపత్రం మారడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొన్ని మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 3,648 మంది పరీక్షకు హాజరు కాగా.. 2,600 మంది(71.27 శాతం) మాత్రమే గట్టెక్కారు.
శాస్త్రీయత ఏదీ..?
వాస్తవంగా సిలబస్ యేతర ప్రశ్నలు వస్తే.. ఎన్ని మార్కులు కలపాలన్న విషయంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి. మొత్తం ఎన్ని మార్కులకు సిలబస్ బయటి నుంచి ప్రశ్నలు వచ్చాయి.. ఎన్ని మార్కులు ఏ ప్రాతిపదికన కలపాలి.. తదితర అంశాలను కమిటీ నిర్ణయించాలి. కానీ ఇందంతా లేకుండా.. తమకు తోచినట్లుగా అధికారులు మార్కులు కలిపారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు ఏ విద్యార్థికి మొదట ఎన్ని మార్కులు వచ్చాయి? తర్వాత ఎన్ని కలిపారు? అనే విషయాలపై అధికారుల వద్దే స్పష్టత లేదు.
దీంతో ఏ శాస్త్రీయ పద్ధతులు అవలంబించలేదని వెల్లడవుతోంది. అధికారులు చేతులు దులిపేసుకునే క్రమంలో కొన్ని మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేశారని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ విషయమై ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేశ్ కుమార్‌ను వివరణ కోరగా.. ఏం జరిగిందనేది సంబంధిత శాఖ నుంచి తెలుసుంటానని చెప్పారు. ఎగ్జామినేషన్ కంట్రోలర్‌ని సంప్రదించగా.. అదనంగా మార్కులు కలిపిన విషయం వాస్తవమేనని.. ఎన్ని కలిపామో చెప్పలేమని బదులిచ్చారు. మొత్తం మీద అధికారుల తప్పిదానికి విద్యార్థుల భవిష్యత్ బలవుతోంది.
తప్పొకరిది.. శిక్ష మరొకరికా?
Published Tue, Oct 13 2015 4:06 AM | Last Updated on Sun, Sep 3 2017 10:51 AM
Advertisement