మద్యం తాగేందుకు బార్‌కు వెళ్లిన యువకులపై నిర్వాహకులు దాడి చేసి గాయపర్చిన ఘటన ఉప్పల్‌లో జరిగింది.
హైదరాబాద్: మద్యం తాగేందుకు బార్‌కు వెళ్లిన యువకులపై నిర్వాహకులు దాడి చేసి గాయపర్చిన ఘటన ఉప్పల్‌లో జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఓ యువకుడు చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం... నల్లగొండజిల్లా వలిగొండ మండలం ఎదులాపురం గ్రామానికి చెందిన విష్ణు(32), కాసుల లక్ష్మణస్వామి (31) బోడుప్పల్ బుద్దానగర్‌లో నివాసం ఉంటూ డీసీఎం డ్రైవర్లుగా పని చేస్తున్నారు. ఇద్దరూ మంగళవారం రాత్రి ఉప్పల్‌లోని విక్టరీ బార్‌కు వెళ్లారు. మద్యం తాగిన అనంతరం బిల్లు చెల్లించే విషయంలో బార్ నిర్వాహకులు, సిబ్బంది విష్ణు, లక్ష్మణస్వామిలతో గొడవకు దిగారు.
రూ.300 బిల్లు అయితే వెయిటర్‌కు లక్ష్మణస్వామి రూ.500 ఇచ్చాడు. వెయిటర్ మిగతా రూ.200 తిరిగి ఇవ్వకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన బార్ సిబ్బంది లక్ష్మణస్వామిపై పిడిగుద్దులు గుద్ది బార్ పై నుంచి కింది మెట్లపైకి తోశారు. మెట్లపై పడటంతో లక్ష్మణస్వామి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్నేహితులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతున్న లక్ష్మణస్వామి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మరో బాధితుడు విష్ణు ఫిర్యాదు మేరకు పోలీసులు బార్ యజమాని, సిబ్బందిపై సెక్షన్ 324 కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.