కేసీఆర్ తిరుపతి మొక్కులపై కమ్యూనిస్టులు విమర్శలా...!
కేసీఆర్ తిరుపతి మొక్కులపై కమ్యూనిస్టులు విమర్శలా...!
Published Fri, Feb 24 2017 12:27 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM
పరిపూర్ణానంద స్వామి
కాకినాడ రూరల్: తిరుమల, తిరుపతి వేంకటేశ్వర స్వామికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు మొక్కులు చెల్లించుకుంటే విమర్శించే హక్కు సీపీఎం నాయకుడు బీవీ రాఘవులకు లేదని శ్రీ పీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానంద స్వామీజీ తీవ్రంగా విమర్శించారు. గురువారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని శ్రీపీఠంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెంకన్నకు మొక్కులు తీర్చుకున్న కేసీఆర్ అభినందనీయుడన్నారు. ఎవరు ఏ రంగంలో పని చేస్తున్నా ధార్మిక అంశాల పట్ల తన స్వధర్మాన్ని మరిచిపోకూడదన్న సందేశాన్ని కేసీఆర్ అందించారన్నారు. కేసీఆర్ మొక్కులు తీర్చుకోవడం ద్వారా రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం ఆయన మంచి వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న హిందూ ధర్మ పరిరక్షణ సమితి, హెచ్‌డీపీడీ (హిందూధర్మ పరిరక్షణ ట్రస్ట్) రెండూ ప్రభుత్వ సంస్థలేనన్నారు. ఈ విషయం బీవీ రాఘవులు గుర్తించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వాలకు కప్పం కడుతున్నది హిందూ దేవాలయాలు మాత్రమేనన్నారు. ఇతర మతాల సంస్థలు ఒక్క రూపాయి కూడా కప్పం చెల్లించినట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. ముస్లిం, క్రైస్తవ మతాల పండుగలకు, మక్కా, జెరూసలేం వెళ్లడానికి ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వడం సర్వ సాధారణమైన విషయమన్నారు. అప్పుడు పైకిలేవని గొంతులు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయని ప్రశ్నించారు. హిందూ ధర్మం ఆచరించని వ్యక్తికి ప్రశ్నించే హక్కు ఎక్కడిదని మండిపడ్డారు. వేంకటేశ్వర స్వామి యూనివర్శిటీలో ఎంతో మంది ఇతర మతాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారన్నారని, అదే ఇతర మతాలకు చెందిన విద్యా సంస్థల్లో హిందూవులకు ప్రవేశం ఇస్తారా అని పరిపూర్ణానంద స్వామి ప్రశ్నించారు.
Advertisement
Advertisement