
బీసీలను రెచ్చగొడుతున్నారు: చంద్రబాబుపై రఘువీరా ఫైర్
కాపులను బీసీల్లో చేర్చే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంభిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు.
- కాపుల విషయంలో సీఎం చంద్రబాబుది రెండు కళ్ల వైఖరి
- చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ తీర్మానం చేయాలి
- కాపు కులాల సదస్సులో పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఉద్ఘాటన
- ముద్రగడ పద్మనాభం చేపట్టిన సభను విజయవంతం చేయాలని పిలుపు
సాక్షి, విజయవాడ బ్యూరో: కాపులను బీసీల్లో చేర్చే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అవలంభిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. ఒకవైపు కాపులను బీసీల్లో చేరుస్తానని మాయమాటలు చెబుతూ మరోవైపు చందాలు ఇచ్చి మీటింగ్‌లు పెట్టించి బీసీలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. విజయవాడలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల సదస్సులో రఘువీరారెడ్డి మాట్లాడారు. ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలు కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చాయని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ, బీజేపీలు ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా ఏకగ్రీవ ఆమోదం ఉన్నందున చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో తీర్మానం చేసి ఫిబ్రవరి నెలాఖరులోగా పార్లమెంట్‌కు పంపితే కాంగ్రెస్‌తోపాటు యూపీఏ భాగస్వామ్య పక్షాలు మద్దతు ఇస్తాయని చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చే దిశగా కృషి చేసేందుకు కాంగ్రెస్‌లో కాపు విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు రఘువీరారెడ్డి ప్రకటించారు.
ముద్రగడ పద్మనాభం నిర్వహించే సభకు వెళ్లొద్దంటూ టీడీపీలోని కాపు ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రకటనలు చేస్తూ కాపు జాతికి ద్రోహం చేస్తున్నారని రఘువీరా మండిపడ్డారు. ముద్రగడ ఈ నెల 31న తలపెట్టిన సభకు పార్టీలకు అతీతంగా తరలివెళ్లి విజయవంతం చేయాలని, ప్రభుత్వంపై వత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు. ఒక సామాజికవర్గం కోసమే పనిచేస్తున్న ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చే విషయంలో చంద్రబాబును శంకించాల్సి వస్తోందని శాసనమండలి కాంగ్రెస్ పక్షనేత సి.రామచంద్రయ్య అన్నారు. గతంలో ఇచ్చిన పుట్టుస్వామి కమిషన్ రిపోర్డును ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా కాపులను బీసీల్లో చేర్చే విషయంలో కాలపరిమితిని ప్రకటించకపోవడం అనుమానానికి తావిస్తోందన్నారు. రాష్ర్టంలో ఒక సామాజికవర్గం కోసమే టీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని, పదవులు, భూములు, కాంట్రాక్టులు అన్నీ ఆ సామాజికవర్గం చేతిలోనే ఉన్నాయని సి.రామచంద్రయ్య ఆరోపించారు.
ఇదిలా ఉండగా, దివంగత కాపు నేత వంగవీటి మోహనరంగా ఫొటో వేదిక వెనుక ఫ్లెక్సీలో లేకపోవడంపై ఆగ్రహించిన ఆయన అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. వేదికపై ఉన్న నేతలు స్పందిస్తూ పొరపాటు జరిగిందని అంగీకరించి ఫ్లెక్సీలో రంగా ఫొటోను ఏర్పాటు చేయడంతో వివాదం సద్దుమణిగింది. సదస్సులో రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, పీసీసీ ప్రధాన కార్యదర్శి నరహరశెట్టి నర్సింహారావు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు తదితరులు మాట్లాడారు.