చదువుకుంటా..చందాలివ్వండి!
చదువుకునేందుకు చందాలివ్వండి అంటూ శ్రీవాణి అనే నర్సింగ్ విద్యార్థిని వేడుకుంటోంది. అయినవారు పట్టించుకోకపోవడంతో అనాథలా మారిన తనకు దాతలు ఆర్థిక సహాయం చేయాలని కోరుతోంది. సోమవారం కలెక్టరేట్ ఎదుట కన్పించిన ఈ అమ్మాయి తన వివరాలను తెలిపింది. బాలయపల్లి మండలం సంఘవరం గ్రామానికి చెందిన సుధరరావు, శాంతకుమారిలకు ముగ్గురు సంతానం. వి.శ్రీవాణి చివరి సంతానం. తల్లిదండ్రులు ఆనారోగ్య కారణంగా మరణించారు. అక్క, అన్నా, బాబాయిలు ఆదరించలేదు. తల్లిదండ్రులు మరణించే సమయానికి శ్రీవాణి 7వ తరగతి చదువుతుంది. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు లేని కారణంగా స్కాలర్‌షిప్ అర్హత లేదు. తల్లిదండ్రులు మరణించడంతో నాయుడుపేటలోని క్రిష్టియన్ మిషనరీ శ్రీవాణిని చేరదీసింది. ఇంటర్ వరకు అక్కడే చదువు చెప్పించారు. ఇంటర్‌లో 60 శాతం మార్కులు సాధించిన శ్రీవాణి పోతిరెడ్డిపాళెంలోని గ్లోబల్ నర్సింగ్ కళాశాలలో మేనేజ్‌మెంట్ కోటాలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరింది. మొదటి సంవత్సరం పీజు మిషనరీ వారు చెల్లించారు. రెండవ సంవత్సరం ఫీజులు చెల్లించలేమని తెలిపారు. నానా ఇక్కట్లు ఎదుర్కొంది. నాయుడుపేట ఆమ్మా హాస్పిటల్‌లో పనిచేస్తూ కొంతకాలం జీవనం సాగించింది. కళాశాల యాజమాన్యం సహకారం, తనకొచ్చే వేతనంతో రెండో సంవత్సరం ఫీజులు చెల్లించి పరీక్షలు రాసింది. మంచి మార్కులు వచ్చాయి. మూడో సంవత్సరానికి మళ్లీ ఇబ్బందులు ఎదురయ్యాయి. నవంబర్‌లో పరీక్షలున్నాయి. దాతలు సహకరిస్తే చదువు పూర్తి చేస్తానని తెలిపారు. సాయం చేయదలచినవారు 99857 51662, 98667 87051 ఫోన్ నంబర్లకు దయతో సంప్రదించాలని కోరుతోంది. – నెల్లూరు(పొగతోట)