తమ కూతురు ఆత్మహత్యపై నియమించిన నిజనిర్దారణ కమిటీపై తమకు ఏమాత్రం నమ్మకంలేదని నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని రిషితేశ్వరి తల్లిదండ్రులు అన్నారు.
గుంటూరు: తమ కూతురు ఆత్మహత్యపై నియమించిన నిజనిర్దారణ కమిటీపై తమకు ఏమాత్రం నమ్మకంలేదని నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని రిషితేశ్వరి తల్లిదండ్రులు అన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య విచారణకు యూనివర్సిటీ వేసిన నిజనిర్దారణ కమిటీపై తొలిసారి సాక్షితో మాట్లాడిన పేరెంట్స్ మురళీకృష్ణ, దుర్గాభాయి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ కూడా కమిటీలో సభ్యుడిగా ఉంటే ఇంకేం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు.
సమాజ సేవకులు, విద్యార్థులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, లాయర్లను కమిటీలో వేయాలని వారు డిమాండ్ చేశారు. ముందు ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని ఆయన ఉద్యోగంలో ఉంటే తమకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. ఏడాది నుంచి తాము కాలేజీకి వస్తున్నా ఇంతవరకు హాస్టల్ వార్డెన్ ఎవరో కూడా తమకు తెలియదని, ఒక్కసారి కూడా ఆయన కనిపించలేదని చెప్పారు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా ఆమె కనిపించలేదని అన్నారు. అంతా అయిపోయాక హాస్టల్లో సీసీటీవీ కెమెరాలు పెడతామంటే ఏం లాభమని ప్రశ్నించారు.