
రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
మహబూబ్నగర్ : టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలో కొత్తగా నిర్మించిన మార్కెట్ యార్డ్కు జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ శంకుస్థాపన ఉంది. అయితే మంత్రి పర్యటనకు ముందే అక్కడకు చేరుకున్న రేవంత్ రెడ్డి ....ప్రొటోకాల్ ప్రకారం తమను ఆహ్వానించలేదని ధర్నాకు దిగటంతో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల వాహనాలపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. జీపు అద్దాలను ధ్వంసం చేశారు.
పరిస్థితి అదుపు తప్పటంతో రేవంత్ రెడ్డితో పాటు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్ యార్డ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాగా అదుపులోకి తీసుకున్న రేవంత్ రెడ్డిని దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ కార్యకర్తలు బైఠాయించి నిరసన చేపట్టారు. మరోవైపు మంత్రి జూపల్లి మార్కెట్ యార్డ్కు శంకుస్థాపన చేశారు.