
అక్రమ సంబంధం వల్లే హత్య
వారం రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు
మెదక్‌రూరల్: అక్రమ సంబంధమే హత్యకు దారితీసిందని స్థానిక సీఐ రామకృష్ణ తెలిపారు. వారం రోజుల్లో హత్య కేసు చేధించి, నిందితులను అరెస్ట్‌చేసి శుక్రవారం మెదక్ పట్టణంలోని తన కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం మేరకు దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన వడ్ల రాజశేఖర్(28) ఈనెల 6న హత్యకు గురయ్యాడు. మృతుడి భార్య హేమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం రిపోర్టులో రాజశేఖర్‌ను గొంతు నుమిలి చంపేసినట్లుగా పోలీసులు గుర్తించి విచారణ చేపట్టారు.
అదే గ్రామానికి చెందిన డిగ్రీ సెంకడియర్ చదువుతున్న విద్యార్థిని పద్మతో రాజశేఖర్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. కొన్నాళ్లుగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి పద్మను శారీరకంగా వాడుకున్నాడు. అనంతరం పెళ్లికి నిరాకరించాడు. అంతటితో ఆగకుండా ఆ యువతి చెల్లెలిపై కూడా కన్నేయడంతో అతడి ఆగడాలకు తట్టుకోలేక తన తండ్రి లింగపురం కిష్టయ్యకు విషయాన్ని తెలిపింది. ఈ క్రమంలో ఒకటి, రెండుసార్లు రాజశేఖర్‌ను కిష్టయ్య మందలించినా తీరుమారలేదు. దీంతో కిష్టయ్య తన బావమరిది నాగారం సత్తయ్యతో కలిసి రాజశేఖర్ హత్యకు కుట్ర పన్నాడు. ఈ క్రమంలో ఈనెల 6న రాత్రి రాజశేఖర్ పిలవగానే పద్మ వెళ్లిపోయి విషయాన్ని మేనమామ నాగారం సత్తయ్యకు తెలిపింది. దీంతో సత్తయ్య తన ఇద్దరు అనుచరులైన బ్యాగరి నిరంజన్, మోడు మహేష్‌లతో కలిసి అక్కడికి చేరుకుని టవల్‌తో రాజశేఖర్ గొంతుకు ఉరి వేసి హత్య చేశారు.
ఈ హత్యకు పద్మకూడా సహకరించింది. అనంతరం శవాన్ని యూరియా బస్తాలో కుక్కి రంగంపేట కొత్త చెరువు తూములో పడేశారు. ఈ క్రమంలో రాజశేఖర్ భార్య హేమలత తన భర్త కనిపించడం లేదని ఈనెల 9న కొల్చారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదే క్రమంలో స్థానికులు గమనించి కొత్త చెరువు తూములో శవం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు హేమలతను పిలిపించి విచారించగా ఆ శవం తన భర్తదేనని గురించిన విషయం తెలిసిందే. కాగా పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించగా రాజశేఖర్ హత్యకు గురైనట్లు తేలింది. దీంతో పోలీసులు కేసును మరో కోణంలో విచారించగా అసలు విషయం బయటపడింది. కాగా నిందితులను అరెస్ట్‌చేసి విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో కొల్చారం ఎస్‌ఐ విద్యాసాగర్, సైదులు, సిబ్బంది ఉన్నారు.