ఎదురు కాల్పుల సంఘటపై విచారణ చేయాలి
Published Sat, Nov 12 2016 10:44 PM | Last Updated on Tue, Aug 21 2018 7:18 PM
రాజమహేంద్రవరం క్రైం :
గత నెల 24, 25, 27 తేదీల్లో జరిగిన ఎదురు కాల్పుల సంఘటనలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేడంగి చిట్టిబాబు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మావోయిస్టులను అణిచివేసేందుకు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కేంద్ర బలగాల సహకారంతో జాయింట్ ఆపరేషన్లు అమలు చేస్తున్నాయన్నారు. మావోయిస్టులను, సాధారణ ఆదివాసీలను కాల్చి చంపిన పోలీసులపై ఐపీసీ సెక్ష¯ŒS 302 కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసు దర్యాప్తు హైకోర్టు పర్యవేక్షణలో సాగాలన్నారు.
ప్రత్యేక బలగాలు చట్టం పరిధిలో పని చేయడం లేదని, చంపడమే తమ పని అన్నట్టు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. అటవీ ప్రాంతం నుంచి పారా మిలటరీ బలగాలను ఉపసంహరించాలని, కూబింగ్ అపరేషన్లు పూర్తిగా నిలిపివేయాలని, ఏపీ గ్రేహౌండ్స్ దళాలను రద్దు చేయాలని, అటవీ హక్కుల చట్టాన్ని, పంచాయతీ చట్టాన్ని అమలు చేయాలని, మృతి చెందిన ఆదివాసీ కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. వీరి మృతికి కారణమైన పోలీసులపై ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలన్నారు. ఇప్పటికీ పోలీసుల ఆదీనంలో ఉన్న వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. మావోయిస్టులతో సంబంధం లేని తొమ్మిది మంది ఆదివాసీలను పోలీసులు కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో పౌర హక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లెళ మనోహర్, జిల్లా కమిటీ సభ్యులు పల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement