♦ బీసీ ఫ్రెష్, రెన్యూవల్ విద్యార్థులు 32,646 మంది
♦ ఫీజులకు రూ.46 కోట్లు అవసరమైతే వచ్చింది రూ.29 కోట్లు
♦ ఈబీసీ ఫ్రెష్, రెన్యూవల్ విద్యార్థులు 20,437 మంది
♦ ఫీజులకు రూ.40 కోట్లు అవసరమైతే వచ్చింది రూ.19 కోట్లే
♦ విద్యా సంవత్సరం ముగింపులో విద్యార్థుల అవస్థలు
కడప రూరల్ : నిరుపేద విద్యార్థులకు ఫీజు మంజూరు చేయడంలో ప్రభుత్వం చేస్తున్న తాత్సారం వారిని ఇక్కట్ల పాలు చేస్తోంది. విద్యా సంవత్సరం ముగు స్తున్నా ఫీజు సొమ్ము పూర్తిగా విడుదల చేయక పోవడంతో రెన్యూవల్ విద్యార్థులపై ఆయా కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. జిల్లా బీసీ సంక్షేమ శాఖ పరిధిలో నిరుపేద బీసీ, ఈబీసీ విద్యార్థులు 2015-16 విద్యా సంవత్సరానికి అనుమతి పొందిన 487 కళాశాలల్లో ఫీజుల పథకం కింద విద్యను అభ్యసిస్తున్నారు. కీలకమైన విద్యా సంవత్సరం ముగింపు దశలో అరకొరగా ఫీజులు మంజూరు కావడంతో ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులు మానసిక వేదనకు లోనవుతున్నారు.
వివిధ కోర్సుల్లో కొత్తగా చేరిన బీసీ విద్యార్థులు 13,318 మంది, రెన్యూవల్ 19,328 మంది కలిపి మొత్తం 32,646 మంది విద్యార్థులు ఉన్నారు. వీరి కాలేజీ ఫీజులకు మొత్తం రూ.46 కోట్లు అవసరం కాగా, ఇప్పటివరకు రూ.29 కోట్లు వచ్చింది. ఇంకా రూ.17 కోట్లు రావాల్సి ఉంది. మొత్తం 32,646 మంది విద్యార్థుల్లో ఫ్రెషర్స్ 11,459 మందికి 50 శాతం 17,243 మంది రెన్యూవల్స్ విద్యార్థులకు 75 శాతం ఫీజులను మొత్తం 28,702 మందికి మంజూరు చేశారు. స్కాలర్‌షిప్పులకు సంబంధించిన రూ.14 కోట్లు మంజూరు చేసింది. ఫీజులకు సంబంధించి ఆయా కళాశాలల పరిధిలో 3,944 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. బడ్జెట్ లేని కారణంగా డబ్బులు విడుదల కాలేదు.
ఈబీసీలకు మంజూరు చేసింది రూ.19 కోట్లే
ఈబీసీలు ఫ్రెషర్స్ 7011 మంది, రెన్యూవల్స్ 13,428 మంది కలిపి మొత్తం 20,439 మంది విద్యార్థులు ఉన్నారు. వీరి కాలేజీ ఫీజులకు రూ.40 కోట్లు అవసరం కాగా, ఇప్పటివరకు రూ.19 కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లించింది. ఇంకా రూ.21 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తం 20,439 మంది విద్యార్థులకుగాను ఫ్రెషర్స్ 1824 మందికి 50 శాతం, రెన్యూవల్ విద్యార్థులు 1044 మందికి 75 శాతం ఫీజులను మంజూరు చేశారు. తాజాగా ఐదు వేల దరఖాస్తులు ఫుల్ షేప్‌లో కార్యాలయానికి వచ్చాయి. వివిధ కళాశాలల నుంచి 3057 మంది దరఖాస్తులు రావాల్సి ఉంది. బడ్జెట్ లేని కారణంగా కొత్త విద్యార్థులకు ప్రయోజనం చేకూరడం అనుమానమే.
విద్యార్థులకు ఫీజుల పరీక్ష
విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చిందంటే ముఖ్యంగా రెన్యూవల్ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది. ఈ దశలో ఆయా కళాశాలల యాజమాన్యాలు మిగిలిన ఫీజు చెల్లించమని ఒత్తిడి తెచ్చే అవకాశం లేకపోలేదు. అలా విద్యార్థులపై ఒత్తిడి చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కొన్ని కళాశాలల యాజమాన్యాలు ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఫీజుల కోసం ఒత్తిడి తెస్తున్నాయి. ఫలితంగా నిరు పేద విద్యార్థులు అటు ఫీజు చెల్లించలేక, ఇటు యాజమాన్యాల పోరును భరించలేక అవస్థలకు గురవుతున్నారు.