చదువులతో చెలగాటం | Government program fee reimbursements delay | Sakshi
Sakshi News home page

చదువులతో చెలగాటం

Published Fri, May 27 2016 2:07 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

చదువులతో చెలగాటం - Sakshi

చదువులతో చెలగాటం

నిరుపేద విద్యార్థులకు వరం.. ఫీజు రీయింబర్స్‌మెంట్. ప్రతిభ ఉన్నప్పటికీ లక్ష్మీ కటాక్షం లేని విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలన్న ఆశయంలో....

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి పాతరేస్తున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: నిరుపేద విద్యార్థులకు వరం.. ఫీజు రీయింబర్స్‌మెంట్. ప్రతిభ ఉన్నప్పటికీ లక్ష్మీ కటాక్షం లేని విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలన్న ఆశయంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఎంతోమంది పేద పిల్లల భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు టీడీపీ ప్రభుత్వం క్రమంగా చాపచుట్టేసే ప్రయత్నం చేస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ‘కాగ్’ మొట్టికాయలు వేసినా, విద్యార్థులు ఆందోళన చేసినా, ప్రతిపక్షం నిలదీసినా ప్రభుత్వం చలించడం లేదు.

విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నా.. ఫీజు రీయింబర్స్ చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.1,690 కోట్ల బకాయిల చెల్లింపుపై ఇప్పటికీ నోరువిప్పడం లేదు. విసుగెత్తిపోయిన ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు.. ఫీజులు పూర్తిగా చెల్లిస్తేనే పరీక్షలు రాసేందుకు అనుమతిస్తామంటూ అల్టిమేటం జారీ చేశాయి. దీంతో మరో గత్యంతరం లేక విద్యార్థుల తల్లిదండ్రులు అధిక వడ్డీలకుఅప్పులు తెచ్చి ఫీజులు చెల్లించారు.

అప్పులు పుట్టని వందలాది మంది నిరుపేద విద్యార్థులు ఫీజులు చెల్లించలేక విలువైన విద్యా సంవత్సరాన్ని నష్టపోయారు. తెలంగాణలో చదువుతున్న ఏపీ విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోవడంతో.. కోర్సులు పూర్తయినా విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు కాలేజీల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయి. సర్టిఫికెట్లు లేకపోవడంతో ఉద్యోగాల్లో చేరలేని దుస్థితి దాపురించింది.
 
1.51 లక్షల మందిపై అనర్హత వేటు
* రాష్ట్రంలో ఆర్‌టీఎఫ్(రీయింబర్స్‌మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు), ఎంటీఎఫ్(మెయింటనెన్స్ ఛార్జీలు) రూపాల్లో ప్రభుత్వం విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తోంది.
* 2015-16లో కొత్తగా 6,61,210 మంది, రెన్యూవల్ కోసం 8,53,216 మంది... వెరసి 15,14,426 మంది విద్యార్థులు ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఆర్‌టీఎఫ్ రూపంలో రూ.1,987.83 కోట్లు, ఎంటీఎఫ్ రూపంలో రూ.571.95 కోట్లు.. మొత్తం రూ.2,559.78 కోట్లు మంజూరు చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
* ఉపకార వేతనాల భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం 1,51,534 మంది విద్యార్థులపై అనర్హత వేటు వేసింది. ఇందులో 34 వేల మంది ఎస్సీలు, 9,870 మంది ఎస్టీలు, 51 వేల మంది బీసీలు ఉన్నారు.
* వడపోతల తర్వాత 13,62,892 మందిని అర్హులుగా తేల్చింది. వీరికి ఆర్‌టీఎఫ్ రూపంలో రూ.1,845.13 కోట్లు, ఎంటీఎఫ్ రూపంలో రూ.448.8 కోట్లు.. మొత్తం రూ.2,293.93 కోట్లు కేటాయించింది. అంటే 1.51 లక్షల మంది విద్యార్థుల కడుపుకొట్టిన ప్రభుత్వం రూ.265.85 కోట్లు మిగుల్చుకుంది.
* ప్రతిఏటా విద్యార్థుల సంఖ్య పెరగడం పరిపాటి. అయినా ప్రభుత్వం ప్రతిఏటా దాదాపు 13 లక్షల మందికే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తింపజేస్తోంది. విద్యార్థులు సంఖ్యను తగ్గించడానికి అడ్డగోలు నిబంధనలను అమల్లోకి తెస్తోంది. నిబంధనల పేరిట విద్యార్థులపై అనర్హత వేటు వేస్తోంది. 2014-15లో దాదాపు 85 వేల మందిపై అనర్హత వేటు వేయగా, 2015-16లో ఏకంగా 1.51 లక్షల మందిని అనర్హులను చేయడం గమనార్హం.
 
కాగ్ కన్నెర్ర చేసినా మొద్దునిద్రే
ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్(కాగ్) పలు సందర్భాల్లో తప్పుపట్టింది. 2012-13లో ఫీజు రీయింబర్స్‌మెంట్ తీరును ‘కాగ్’ సమీక్షించింది. ఫీజులను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడం వల్ల ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల నుంచి ముక్కుపిండి డబ్బు వసూలు చేస్తున్నాయని తేల్చింది. దీనివల్ల విద్యార్థుల ఆత్మాభిమానం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేసింది.

2015-16లోనైనా విద్యా సంవత్సరం ముగిసేలోగా ఫీజులు రీయింబర్స్ చేయాలని 2015 ఆగస్టు 7న ప్రభుత్వానికి లేఖ రాసింది. కాగ్ పదేపదే కడిగిపారేసినా ప్రభుత్వానికి కనువిప్పు కలగకపోవడం గమనార్హం. 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఏప్రిల్ నాటికి రూ.1,690 కోట్లు ఉన్నాయి. విద్యార్థులు ఉద్యమాలు చేయడం, ప్రతిపక్షం ఒత్తిడి చేయడంతో ఇటీవల సుమారు రూ.526 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఇక 2014-15 విద్యా సంవత్సరానికి సంబంధించిన బకాయిలు రూ.60.15 కోట్లను ఇప్పటికీ చెల్లించలేదు. 2016-17 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం కనీసం రూ.2,400 కోట్లు అవసరం. అంటే.. మొత్తం రూ.4,150 కోట్లు కావాలి. కానీ, 2016-17 బడ్జెట్‌లో విద్యార్థుల ఫీజుల కోసం కేవలం రూ.2,400 కోట్లు మాత్రమే కేటాయించడం గమనార్హం.
 
తెలంగాణలో ఏపీ విద్యార్థుల పరిస్థితి ఘోరం
తెలంగాణలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయ్యింది. విభజన నేపథ్యంలో 2014-15 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడంపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం ఏర్పడింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని కళాశాలల్లో చదువుతున్న ఏపీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయబోమని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో ఆ విద్యార్థుల ఫీజులను తామే చెల్లిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఆ మాటలు నమ్మిన 8,432 మంది ఏపీ విద్యార్థులు 2014-15లో హైదరాబాద్‌లో వివిధ కాలేజీల్లో చేరారు. 2015-16 విద్యా సంవత్సరం ప్రారంభమైనా.. 2014-15కు సంబంధించిన ఫీజులను ఏపీ ప్రభుత్వం చెల్లించలేదు. 2015-16 విద్యా సంవత్సరంలో ప్రారంభంలోనూ చంద్రబాబు మళ్లీ అదే హామీ ఇవ్వడంతో 9,444 మంది ఏపీ విద్యార్థులు తెలంగాణలో వివిధ కళాశాలల్లో చేరారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి తేవడంతో ఫిబ్రవరి 24న తెలంగాణ ఉన్నతాధికారులతో ఏపీ అధికారులు సమావేశమయ్యారు. 2014-15, 2015-16 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రాజ్యాంగంలోని 371(డీ) ఆధారంగా విద్యార్థుల ‘స్థానికత’ను తేల్చి చెల్లించేలా ఇరు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది.

విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న సంవత్సరానికి ముందు ఏడేళ్లలో వరుసగా నాలుగేళ్లు ఏ రాష్ట్రంలో చదివి ఉంటే ఆ రాష్ట్రమే వారి ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయడానికి ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. తెలంగాణలో చదువుతున్న ఏపీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. 2014-15, 2015-16 విద్యా సంవత్సరాలకు సంబంధించి 17,876 మంది విద్యార్థులు ఇటీవల దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఆ దరఖాస్తులను ప్రభుత్వం కనీసం పరిశీలించకపోవడం గమనార్హం.

తెలంగాణ సర్కారు మాత్రం స్థానికత ఆధారంగా చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేస్తోంది. ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడంతో ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలకు అనుమతిస్తామని ప్రైవేట్ కాలేజీలు తేల్చిచెప్పాయి. ఫీజులు చెల్లించని విద్యార్థులను పరీక్షలు రాసేందుకు అనుమతించడం లేదు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో 40 మంది ఏపీ విద్యార్థులు చదువుతున్నారు. 30 మంది విద్యార్థుల ఫీజులను వారి తల్లితండ్రులు అప్పులు చేసి చెల్లించారు. తాము ఫీజులు చెల్లించకపోవడంతో పరీక్ష రాసేందుకు యాజమాన్యం అనుమతించడం లేదని మిగిలిన 10 మంది విద్యార్థులు వాపోయారు.

రూ.1,690 కోట్ల బకాయిలు
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం 2016-17 బడ్జెట్‌లో రూ.2,400 కోట్ల మేర నిధులు కేటాయించినా.. వాటిని విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. 2015-16 విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్, ఎంటీఎఫ్ రూపంలో మొత్తం రూ.1,690 కోట్లు బకాయిపడింది.
 
ఫీజు రీయింబర్స్‌మెంట్ సగమే
‘‘ఇంజనీరింగ్ ఈ ఏడాదితో పూర్తయ్యింది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ సగమే వచ్చింది. పూర్తిస్థాయిలో రీయింబర్స్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నాను. మొత్తం ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని కాలేజీ మేనేజ్‌మెంట్ అంటోంది’’
- సీహెచ్ శిరీషా, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా  
 
వడ్డీలకు తెచ్చి ఫీజులు చెల్లిస్తున్నాం
‘‘ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే ప్రతి విద్యార్థికీ సంవత్సరానికి రూ.37,500 చొప్పున ప్రభుత్వం చెల్లించా లి. అయితే ఫీజులను సమయానికి చెల్లించకపోవడంతో కళాశాల వాళ్లు ముందు మమ్మల్ని కట్టమంటున్నారు. ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్ వస్తే తిరిగి ఇచ్చేస్తామంటున్నారు. దీంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఫీజులు చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం గడువులోగా ఫీజులు చెల్లిస్తేనే మాలాంటి పేదలకు ఉపశమనం కలుగుతుంది’’         
- టి.నాగసాయిదొర, ఇంజనీరింగ్ విద్యార్థి, కాకినాడ
 
బకాయిల మాటేంటి?
రాష్ట్ర విభజనకు ముందు 2011 నుంచి 2014 నాటి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఇంకా చెల్లించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ 58 శాతం, తెలంగాణ 42 శాతం బకాయిలు చెల్లించేలా ఒప్పందం కుదిరింది. కానీ, ఏపీ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తెలంగాణ సర్కారు బకాయిలను విడుదల చేయడం లేదు. 2011-12, 2012-13, 2013-14లో దాదాపు 40 వేల మంది ఏపీ విద్యార్థులు హైదరాబాద్ పరిసరాల్లోని కాలేజీల్లో చేరి చదువులు పూర్తి చేసుకున్నారు.

రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు వారికి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్లో ఏపీ వాటా కింద రూ.285 కోట్లు విడుదల చేస్తే.. తమ వాటా నిధులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కా నీ, ఏపీ సర్కారు నోరువిప్పడం లేదు. కోర్సు పూర్తయినా సర్టిఫికెట్లు రాక ఉద్యోగాల్లో చేరలేని దుస్థితిలో విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement