సారిక, పిల్లల మృతదేహాలకు పోస్టుమార్టం
మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య ఇంట్లో అనుమానాస్పద పరిస్థితిలో మరణించిన ఆయన కోడలు సారిక, ముగ్గురు మనవళ్ల మృతదేహాలకు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయింది. హైదరాబాద్ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో ఈ పోస్టుమార్టం పూర్తి చేశారు. ఈ నివేదిక వెల్లడైతే గానీ సారిక, పిల్లలది బలవన్మరణమో, ఆత్మహత్యోనన్న విషయం తెలిసే అవకాశం లేదు. ఇంట్లో గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో సారిక, ఆమె పిల్లలు సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. ఈ మరణాలు అనుమానాస్పదంగా ఉండటంతో మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
కాగా, మరోవైపు రాజయ్య కుటుంబ సభ్యులకు కూడా ఎంజీఎం ఆస్పత్రిలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం వాళ్లు ముగ్గురూ పోలీసుల అదుపులో ఉండటంతో వాళ్లకు కూడా వైద్య పరీక్షలు చేశారు.