సర్వం సిద్ధం
- రేపు ‘అనంత’లో రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలు
- హాజరుకానున్న సీఎం చంద్రబాబు
- ఏర్పాట్లన్నీ పూర్తి చేసిన అధికారులు
- భద్రత, కార్యక్రమ నిర్వహణపై గుబులు
రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే జిల్లా కేంద్రంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియాన్ని (పీటీసీ మైదానం) సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రాష్ట్రస్థాయి వేడుకలు జిల్లా చరిత్రలో తొలిసారిగా నిర్వహిస్తుండడంతో అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్టేడియాన్ని శనివారం ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ, సీఎం సెక్యూరిటీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ రెండు రోజుల పాటు స్టేడియంలోకి బయటి వ్యక్తులకు అనుమతి లేదు. పరిసర ప్రాంతాల్లోనూ ప్రత్యేక ఆంక్షలు విధించారు.
నేటి (ఆదివారం) నుంచి మరుసటి రోజు వేడుకలు ముగిసేదాకా నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. ఫ్లైఓవర్ నుంచి పీటీసీ మీదుగా లక్ష్మీనగర్, రాంనగర్ మార్గంలో రాకపోకలు నిషేధిస్తున్నారు. ఆ ప్రాంత ప్రజలు అటు నుంచి అటే రాంనగర్ వైపునకు వెళ్లాల్సి ఉంటుంది. వాహన తనిఖీలు, ఇంటింటా సర్వేలను పోలీస్ అధికారులు వేగవంతం చేశారు. పరేడ్, సాంస్కతిక∙బందాలు రిహార్సల్స్‌లో నిమగ్నమయ్యాయి. శకటాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి.
అధికారుల్లో గుబులు
ఏర్పాట్లన్నీ తక్కువ సమయంలోనే అధికారులు పూర్తి చేశారు. ఇందుకోసం ఇప్పటి వరకూ రూ. 2.70 కోట్లు వెచ్చించారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. వేడుకలు జరుగుతున్నంత సేపూ భద్రత, నిర్వహణపై అధికారుల్లో గుబులు మొదలైంది. జిల్లా నుంచి దాదాపు 2,500 మంది పోలీసులను, కొందరు రెవెన్యూ, ఇతర ప్రభుత్వశాఖల అధికారులను కష్ణా పుష్కరాలకు పంపారు. దీంతో పంద్రాగస్టు రోజున భద్రత, నిర్వహణ ఎలా ఉంటుందనే టెన్షన్ అందరిలోనూ మొదలైంది. కేవలం 1,500 మందితోనే బందోబస్తు నిర్వహిస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్ ఆంక్షలు అవసరానికి మించి విధిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. నగరంలోకి ప్రవేశించే బళ్లారి బైపాస్‌రోడ్డు, కళ్యాణదుర్గం బైపాస్‌రోడ్డు, రుద్రంపేట నుంచి పీటీసీ వైపు వచ్చే లక్ష్మీనగర్‌రోడ్డు, కోర్టు రోడ్డు, టవర్‌క్లాక్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. దీంతో స్వాతంత్య్ర వేడుకలు చూసేందుకు వచ్చే ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాల్లో వాహనాలు నిలబెట్టి స్టేడియానికి నడుచుకుని రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి.