అర్చకులకు వేతనాల పెంపు
అర్చకులకు వేతనాల పెంపు
Published Tue, Sep 27 2016 10:26 PM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
నల్లగొండ కల్చరల్ : తెలంగాణ ప్రాంతంలోని 1,810 దేవాలయాల అర్చకులకు ధూపదీప నైవేథ్యం పథకం కింద ప్రభుత్వం ఇచ్చే వేతనం రూ.2,500లను రూ.6 వేలకు పెంచిందని తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచారి తెలిపారు. మంగళవారం స్థానిక సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహించిన సమాఖ్య జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. అర్చక సంక్షేమం కోసం అర్చక వెల్ఫేర్ బోర్డుకు రూ.87 కోట్లు కేటాయించారని, ఈ నిధులను అర్చకుల పిల్లల వివాహాలు, గృహ నిర్మాణాలు, విద్యా, వైద్య ఖర్చులకు ఉపయోగిస్తారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న 20 లక్షల మంది పేద బ్రహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.100 కోట్లు బడ్జెట్ కేటాయించిందని, త్వరలోనే కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా పేద బ్రహ్మణులకు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. ప్రాచీన దేవాలయాల అభ్యున్నతికి ప్రభుత్వం రూ.400 కోట్లు కేటాయించడంపై సమాఖ్య సంతోషం వ్యక్తం చేస్తుందని తెలిపారు. అక్టోబర్ 16వ తేదీన వరంగల్‌లో బ్రహ్మణ వధూవరుల వివాహాల కోసం కళ్యాణమస్తు కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని బ్రహ్మణులు వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా చిలకమర్రి శ్రావణ్‌కుమారాచర్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పెన్నా మోహన్‌శర్మ, బ్రహ్మణ సేవా సమితి జిల్లా అధ్యక్షుడిగా గుండెపూడి జానకీరామశర్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Advertisement