నలుగురు విద్యార్థులను కాపాడి.. ప్రధానోపాధ్యాయురాలు మృతి
స్వాతంత్య్ర దిన వేడుకల ఏర్పాట్లలో ప్రమాదం
* జెండాగా అమర్చే ఇనుప పైపును సిద్ధం చేసిన ప్రధానోపాధ్యాయురాలు
* గద్దెపై అమర్చి, తీస్తుండగా విద్యుత్ తీగలకు తగిలిన పైపు
* నలుగురు విద్యార్థులకు విద్యుత్ షాక్..
* ప్రాణాలకు తెగించి వారిని తోసేసిన హెచ్‌ఎం
* విద్యుత్ షాక్ తగలడంతో కన్నుమూత
పూడూరు: అదో ప్రాథమిక పాఠశాల.. తెల్లవారితే స్వాతంత్య్ర దినోత్సవం.. ముందుగా ఏర్పాట్లు చేసుకునేందుకు ఆదివారమే ప్రధానోపాధ్యాయురాలు పాఠశాలకు వచ్చారు.. కొందరు విద్యార్థుల సహాయంతో జెండా గద్దెను శుభ్రం చేశారు. జెండాగా అమర్చే ఇనుపపైపును సిద్ధం చేశారు..
ఓసారి పరిశీలిద్దామని జెండా గద్దెలో పైపును అమర్చారు.. తిరిగి తీస్తుండగా పాఠశాల పైనుంచి వెళుతున్న విద్యుత్ తీగలకు తాకింది.. దీంతో పైపును పట్టుకున్న విద్యార్థులంతా విద్యుత్ షాక్ తగిలి అల్లాడిపోయారు.. అది చూసిన హెచ్‌ఎం ప్రాణాలకు తెగించి విద్యార్థులను పక్కకు తోసేశారు.. కానీ దురదృష్టవశాత్తు ఆమె విద్యుత్ షాక్‌కు గురై మరణించారు. నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆదివారం రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం మేడికొండ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాల్‌కు చెందిన ప్రభావతి (40) మేడికొండ పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. స్వాతంత్య్ర దిన వేడుకల కోసం ఏర్పాట్లు చేసేందుకు ఆమె ఆదివారం పాఠశాలకు వచ్చారు. విద్యార్థుల సాయంతో జెండా గద్దెను సిద్ధం చేశా రు. దానిపై ఇనుప పైపును అమర్చి జెండా ఎగుర వేసేందుకు రిహార్సల్ నిర్వహించారు. పైపును తొలగిస్తుండగా పాఠశాల పైనుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో ఆ పైపును పట్టుకున్న మూడో తరగతి విద్యార్థులు కీర్తన (8), గణేశ్ (8), మధుమతి (8), ఒకటో తరగతి విద్యార్థి శివతేజ (6)లు విద్యుదాఘాతానికి గురయ్యారు. వెంటనే ప్రభావతి విద్యార్థులను పక్కకు తోసేసింది. కానీ ఆమెకు పైపు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నారు. విద్యార్థులకు గాయాలయ్యా యి. స్థానికులు వారిని వికారాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రభావతి మార్గమధ్యలోనే మరణించారు.
విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. కాగా ప్రభావతికి భర్త రాజీవ్‌రెడ్డి, కుమార్తెలు సుభిక్ష (14), నాగహర్షిత (13) ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి, ఎంఈవో కిషన్ తదితరులు ఆస్పత్రికి వచ్చి విద్యార్థులను పరామర్శించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు. కాగా ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభావతి కుటుంబానికి ట్రాన్స్‌కో నుంచి రూ.30 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరాయి.